దేశ రాజధాని చుట్టు పక్కల పంట వ్యర్థాల కాల్చివేత ప్రస్తుతం ఆగిపోయినప్పటికీ.. దిల్లీలో గాలి కాలుష్యం అత్యంత తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్. వాయు కాలుష్య కారకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని దిల్లీ ప్రభుత్వానికి కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ) నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
" బయోమాస్, చెత్త కాల్చివేత, అపరిశుభ్రత, నిర్మాణ, నీటి వినియోగ నిబంధనల ఉల్లంఘన, పాడైపోయిన రోడ్లు, వాటి ద్వారా వెలువడే దుమ్ము వంటి కాలుష్య కారకాలపై సీపీసీబీకి పలు ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతం దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉంది. పంట వ్యర్థాల కాల్చివేత ఆగినా.. దిల్లీ వాయు నాణ్యత గణాంకాలు క్షీణిస్తున్నాయి. ప్రతిరోజు సీపీసీబీకి చెందిన 50 బృందాలు తనిఖీ చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పిస్తున్నాయి. కాలుష్యంపై దిల్లీ ప్రభుత్వానికి సీపీసీబీ నోటీసులు జారీ చేసింది. పంట వ్యర్థాల కాల్చివేత ఆగిన క్రమంలో ఇతర అంశాలపై దిల్లీ ప్రభుత్వం, సంబంధిత సంస్థలు దృష్టి సారించాలి. ప్రస్తుతం రాజధాని ప్రాంతం ఒక్కటే సమస్యపై పోరాడుతోంది. "
- ప్రకాశ్ జావడేకర్, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి.