ఒక నెల వయసున్న పసికందును వీధి కుక్కలు కిరాతకంగా కరిచి చంపేశాయి. రాజస్థాన్లోని సిరోహి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిందీ ఘటన. ఆస్పత్రి వార్డులో సిబ్బంది ఎవరూ లేని సమయంలో.. తల్లి పక్కన పడుకున్న చంటి పాపను వీధి కుక్కలు ఎత్తుకెళ్లి చంపేశాయి. ఈ ఘటనతో ఆ చిన్నారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
తండ్రి కోసం వచ్చి..
చనిపోయిన పసికందు తండ్రి మహేంద్ర మీనా సిరోహి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సిలికోసిస్ చికిత్స కోసం సోమవారం చేరాడు. మహేంద్రతో పాటు భార్య రేఖ, వారి ముగ్గురు పిల్లలు కూడా ఆస్పత్రికి వచ్చారు. సోమవారం రాత్రి ఆస్పత్రి వార్డులో అందరూ నిద్రపోయారు. చిన్నపాప తల్లి దగ్గర పడుకుంది. ఆమె కూడా నిద్రలోకి జారుకుంది. వార్డులో సిబ్బంది పక్క వార్డులోకి వెళ్లిన సమయంలో రెండు కుక్కలు ఆస్పత్రి టీబీ వార్డులోకి ప్రవేశించాయి. దానిలో ఒక కుక్క పసిపాపను పట్టుకొని బయటకు వచ్చినట్లు సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ద్వారా తెలిసింది. రాత్రి 2 గంటల సమయంలో రేఖ నిద్రలేచింది. పక్కన చూస్తే చిన్నారి లేదు. వార్డు బయటకు వచ్చిన రేఖ.. చిన్నారిని వీధి కుక్కలు కరుస్తున్న దృశ్యాలు చూసి నివ్వెరపోయింది. వాటిని తరిమేసింది. కానీ.. ఆ చిన్నారి ప్రాణాలు దక్కలేదు.
"పసిపాప తండ్రి మహేంద్ర మీనా సోమవారం చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరాడు. వీధి కుక్క ఆస్పత్రి వార్డులోకి వచ్చి పాపను ఎత్తుకెళ్లి కరుస్తున్న సమయంలో అక్కడ సిబ్బంది కూడా లేరు. మెడికల్ బోర్డు చిన్నారి మృతదేహానికి శవపరీక్షలు నిర్వహించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము." అని స్థానిక పోలీస్ అధికారి సీతారాం తెలిపారు.