రాజస్థాన్ జైపుర్లో దారుణం జరిగింది. ఓ వీధి కుక్క.. ఐదేళ్ల బాలికపై విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. చిన్నారి ఛాతీ, ఇతర శరీర భాగాలపై కాట్లు వేసింది. ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడింది. హుటాహుటిన చిన్నారిని ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. శునకం దాడి వల్ల చిన్నారి ఊపిరితిత్తుల్లో రంధ్రం ఏర్పడిందని వైద్యులు తెలిపారు. చిన్నారిపై దాడికి పాల్పడిన శునకం.. అంతకుముందు పది మందిని కరిచిందని ఖోరల్దాఖనీ గ్రామస్థులు చెబుతున్నారు. దీంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
చిన్నారిపై వీధి కుక్క దాడి.. ఊపిరితిత్తులకు గాయాలై ఆస్పత్రిలో... - గజరాజు దాడిలో ఇద్దరు మృతి
వీధి కుక్క దాడిలో చిన్నారి తీవ్రంగా గాయపడింది. దీంతో చిన్నారి ఊపిరితిత్తుల్లో రంధ్రం అయింది. ఈ ఘటన రాజస్థాన్లో జరిగింది. మరోవైపు, అడవి ఏనుగు దాడి చేయడం వల్ల ఇద్దరు యువకులు మరణించారు. ఈ ఘోరం అసోంలో వెలుగుచూసింది.
ఇదీ జరిగింది..
చిన్నారి శరీరంపై కుక్క కాట్లు వేయడం వల్ల ఊపిరితిత్తుల్లో రంధ్రం ఏర్పడింది. శస్త్రచికిత్స చేసి రంధ్రం మూసేశామని జేకే లోన్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తుల్లో రంధ్రం వల్ల పిల్లలకు న్యూమోథొరాక్స్ అనే వ్యాధి వస్తుందని వైద్యులు పేర్కొన్నారు. ఈ వ్యాధి వల్ల ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతింటాయని చెప్పారు. మరో 10 రోజుల్లో చిన్నారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అడవి ఏనుగు దాడిలో ఇద్దరు మృతి..
అసోంలోని చరైడియో జిల్లాలో ఘోరం జరిగింది. అడవి ఏనుగు దాడిలో బికాశ్ తంతి(19), గోబిన్ తంతి(18) అనే ఇద్దరు యువకులు మరణించారు. ఆదివారం రాత్రి జరిగిందీ ఘటన. క్రిస్మస్ వేడుకలో పాల్గొని మంజుశ్రీ టీ ఎస్టేట్ మీదుగా ఇంటికి తిరిగి వస్తుండగా వీరిపై గజరాజు దాడికి పాల్పడిందని స్థానికులు తెలిపారు. అడవి జంతువుల నుంచి తమను రక్షించాలని అటవీశాఖను డిమాండ్ చేశారు గ్రామస్థులు. మృతుల కుటుంబాలకు తగిన ఆర్థిక సాయం చేయాలని కోరారు.