చిరునవ్వులను చిదిమేస్తూ చితిమంటలను ఎగదోసిన మహమ్మారి మృత్యుతాండవాన్ని దేశం అప్పుడే మరచిపోయిందా? కొవిడ్ మార్గదర్శకాలకు తిలోదకాలిచ్చిన పాపానికి రెండో ఉద్ధృతి రూపంలో భారీ మూల్యం చెల్లించినా- ఆపత్కాలంలో అప్రమత్తత ఎంత అవసరమో పౌరులకు ఇంకా బోధపడలేదా? గండం గడవక ముందే ఆంక్షలను సడలించిన ప్రభుత్వాలు, స్వీయజాగ్రత్తలను గాలికొదిలేస్తున్న జనసందోహాలను పరికిస్తే- మునుపటి చేదు అనుభవాల నుంచి పాఠాలేమీ నేర్చుకోనట్టే కనిపిస్తోంది!
మహమ్మారి మూడో ఉద్ధృతి ఈ నెలలోనే ప్రారంభమై అక్టోబరు కల్లా పతాకస్థాయికి చేరుతుందంటున్న హైదరాబాద్, కాన్పూర్ ఐఐటీ పరిశోధకుల అధ్యయనం ఆందోళన రేపుతోంది. కొవిడ్ వ్యాప్తి తీవ్రతకు అద్దంపట్టే 'ఆర్ ఫ్యాక్టర్' (పునరుత్పాదక రేటు) ఒకటి దాటిపోయిందని కేంద్రమూ చెబుతోంది. పన్నెండు రాష్ట్రాల్లోని 44 జిల్లాల్లో 10శాతానికి మించిన పాజిటివిటీ రేటుతో కేసులు జోరెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్త కేసుల్లో 47.5శాతానికి కేరళ, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లోని 18 జిల్లాలే పుట్టిళ్లు అవుతున్నాయి. 132 దేశాలకు పాకిన డెల్టా వేరియంట్‌కు తోడు డెల్టాప్లస్, ఆల్ఫా, బీటా, గామా వంటి వైరస్ రకాలు 174 జిల్లాల్లో వెలుగుచూశాయి. డెల్టా దాడితో గడచిన నాలుగు వారాల్లో ఆఫ్రికాలో మరణాలు ఎనభై శాతం పెరిగాయంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ- ముప్పు పూర్తిగా తొలగిపోయే దాకా ఉదాసీనత కూడదని హెచ్చరిస్తోంది.
మనకీ బూస్టర్ డోసు?
పండగలు పబ్బాల కన్నా ప్రజారోగ్య భద్రతే కీలకమన్న సర్వోన్నత న్యాయస్థానం ఇటీవలి తీర్పు- విపత్తు వేళ విచక్షణారహితంగా వేడుకలకు అనుమతులిస్తున్న పాలకుల బాధ్యతారాహిత్యాన్ని బోనెక్కించింది. డిసెంబరు 31లోగా దేశంలోని వయోజనులందరికీ వ్యాక్సిన్లు అందుతాయని లోక్‌సభాముఖంగా కేంద్రం మరోసారి భరోసా ఇచ్చింది. బారులు తీరిన వారందరికీ వ్యాక్సిన్లు ఇచ్చే అవకాశం లేక సిబ్బంది ఇబ్బందుల పాలవుతున్న దృశ్యాలు- టీకా కార్యక్రమంలోని వ్యూహరాహిత్యాన్ని కళ్లకు కడుతున్నాయి.
జనాభాలో 57శాతానికి, నలభై ఏళ్లు పైబడిన వారిలో 80శాతానికి టీకా రక్షణ కల్పించిన ఇజ్రాయెల్- డెల్టా రకం ఉద్ధృతి దృష్ట్యా బూస్టర్ డోసుల పంపిణీ ప్రారంభించింది. 'వ్యాక్సిన్ల రాజధాని' ఇండియా మాత్రం దేశంలోని 94 కోట్ల వయోజనుల్లో ఇప్పటివరకు 11 కోట్ల మందికే రెండు డోసుల టీకాలు అందించింది! మొత్తంగా 48 కోట్లకు కాస్త ఎక్కువ డోసులనే పంపిణీ చేయగలిగింది. జనాభా యావత్తుకు టీకాలు అందాలంటే 270 కోట్లకు పైగా డోసులు అవసరం.