ఎలాంటి చట్టబద్ధత లేకపోయినా ఓ వ్యక్తికి అతని భార్య నుంచి విడాకులు ఇప్పించారు అక్కడి కులపెద్దలు. పంచాయతీకి అతని భార్య రాకపోయినా.. ఆమెకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఫోన్లోనే భర్త నుంచి విడాకులు ఇప్పిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు ఆమె తండ్రి కూడా ఒప్పుకున్నాడు. విచిత్రం ఏంటంటే అతను కేవలం ఒక్క రూపాయి భరణానికి తన కూతురుకు అల్లుడు విడాకులు ఇచ్చేందుకు సరే అనడం. ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా సిన్నర్ ప్రాంతంలో జరిగింది.
ఇదీ జరిగింది.. సిన్నర్‌కు చెందిన బాధితురాలికి కొంతకాలం క్రితం అహ్మద్‌నగర్ జిల్లా లోనీ ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. కానీ భర్త వేధింపులను తట్టుకోలేక ఆమె కొద్ది రోజులకే పుట్టింటికి వచ్చేసింది. ఎన్ని రోజులైనా ఆమె తిరిగి రాకపోవడం వల్ల ఆమెకు విడాకులు ఇవ్వాలని భర్త నిర్ణయించుకున్నాడు. కానీ ఇందుకు అతను చట్టపరంగా ఎవరినీ సంప్రదించకుండా నేరుగా పంచాయతీని ఆశ్రయించాడు.