తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నక్సల్స్​ ఎత్తుగడలు తెలిసీ- చిక్కుకుంటున్న బలగాలు

ఛత్తీస్​గఢ్​లోని తరెం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు జరిపిన భీకర దాడిలో 23 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. సాధారణంగా మావోయిస్టులు ఏటా జనవరి నుంచి జూన్‌, జులై వరకు వివిధ ఆయుధ సామగ్రి తయారీపై శిక్షణ, కొత్త నియామకాలపై దృష్టి సారిస్తారు. పోలీసు బలగాలు లక్ష్యంగా కార్యకలాపాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దీనిని వారు టాక్టికల్‌ కౌంటర్‌ అఫెన్సివ్‌ క్యాంపెయిన్‌(టీసీవోసీ) గా వ్యవహరిస్తారు. గ్రేహౌండ్స్‌ చరిత్రలోనే అతిపెద్ద దుర్ఘటనగా చెప్పే బలిమెల ఉదంతం మొదలుకొని తాజాగా జరిగిన తరెం దాడి వరకు అన్నీ ఈ క్యాంపెయిన్ల సందర్భంగా జరిగినవే.

story on bijapur encounter
నక్సల్స్​ ఎత్తుగడలు తెలిసీ- చిక్కుకుంటున్న బలగాలు

By

Published : Apr 5, 2021, 7:26 AM IST

Updated : Apr 5, 2021, 8:10 AM IST

మావోయిస్టుల ఎత్తుగడలు ఎలా ఉంటాయో తెలిసీ వారు పన్నిన వలలో పోలీస్‌ బలగాలు మరోసారి చిక్కినట్లయింది. ఛత్తీస్‌గఢ్‌లోని తరెం అటవీప్రాంతంలో శనివారం జరిగిన భీకర దాడిలో బలగాలకు భారీ ఎత్తున ప్రాణనష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. సాధారణంగా మావోయిస్టులు ఏటా జనవరి నుంచి జూన్‌, జులై వరకు వివిధ ఆయుధ సామగ్రి తయారీపై శిక్షణ, కొత్త నియామకాలపై దృష్టి సారిస్తారు. పోలీసు బలగాలు లక్ష్యంగా కార్యకలాపాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దీనిని వారు టాక్టికల్‌ కౌంటర్‌ అఫెన్సివ్‌ క్యాంపెయిన్‌(టీసీవోసీ) గా వ్యవహరిస్తారు. గ్రేహౌండ్స్‌ చరిత్రలోనే అతిపెద్ద దుర్ఘటనగా చెప్పే బలిమెల ఉదంతం మొదలుకొని తాజాగా జరిగిన తరెం దాడి వరకు అన్నీ ఈ క్యాంపెయిన్ల సందర్భంగా జరిగినవే. తరెం దాడినీ మావోయిస్టులు పన్నిన ట్రాప్‌గానే మావోయిస్టు కార్యకలాపాల అణిచివేతలో అనుభవమున్న తెలంగాణ పోలీస్‌ అధికారులు చెబుతున్నారు. టీసీవోసీ నేపథ్యంలోనే తెలంగాణ గ్రేహౌండ్స్‌ బలగాలు సరిహద్దుల్లోని కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాల సరిహద్దుల్లో కూంబింగ్‌ ఆపరేషన్లను, వాహన తనిఖీలను, కట్టడి-ముట్టడిని ముమ్మరం చేశాయి.

ట్రాప్‌ ఇలా..

దండకారణ్యంలో జరిగిన పలు భారీ దాడుల్లో భద్రతా సిబ్బందిని మావోయిస్టులు ట్రాప్‌ చేయడం ద్వారానే మట్టుపెట్టగలిగినట్లు తెలంగాణ నిఘావర్గాలు విశ్లేషిస్తున్నాయి. కూంబింగ్‌ ఆపరేషన్ల సందర్భంగా అడవుల్లోకి వెళ్లినప్పుడు ఎలాంటి వ్యూహాల్ని అనుసరించాలనే అంశంపై తెలుగు రాష్ట్రాల గ్రేహౌండ్స్‌ సిబ్బందికి తగినంత నైపుణ్యం ఉంది. సీఆర్పీఎఫ్‌కు అలాంటి నైపుణ్యం లేకపోవడంతో వరుస తప్పిదాలు జరుగుతూనే ఉన్నాయి. మావోయిస్టులు 'ట్రాప్‌' చేసి భద్రతా సిబ్బందిని దెబ్బతీస్తున్నారు. ట్రాప్‌ చేసే క్రమంలో ఓ ప్రాంతంలో బహిరంగ సమావేశం పెట్టడమో, ఎవరినైనా చంపడమో చేస్తుంటారు. ఆ విషయం తెలుసుకున్న సీఆర్పీ బలగాలు ఆ ప్రాంతానికి వెళతాయి. ఆ మార్గాల్లో దాడికి అనువైన ప్రదేశాలను ఎంచుకొని మావోయిస్టులు కాపు కాస్తారు. బలగాలు ఎదురుకాల్పులకు దిగినా తమకు పెద్దగా నష్టం వాటిల్లకుండా మావోయిస్టులు జాగ్రత్తలు తీసుకుంటారు.

టీసీవోసీ సందర్భంగా జరిగిన దుర్ఘటనలివి..

  • 2008 జూన్‌ 29న ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని బలిమెల రిజర్వాయర్‌లో భారీ దాడి జరిగింది. కూంబింగ్‌ నిర్వహించి బోటులో తిరిగి వస్తున్న గ్రేహౌండ్స్‌ బలగాలపై ఒడ్డుపై నుంచి మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో 38 మంది పోలీసులు మృతిచెందారు.
  • 2009 జులై 13న రాజ్‌నంద్‌గావ్‌ అటవీప్రాంతంలో ల్యాండ్‌మైన్‌ దాడికి పాల్పడటంతో ఓ ఎస్పీ సహా 30 మంది పోలీసులు మృత్యువాతపడ్డారు. ఈ ఒక్క ఏడాదిలోనే మావోయిస్టులు దాదాపు 200 మందిని పొట్టనపెట్టుకున్నారు.
  • 2010 ఏప్రిల్‌ 6న ఛత్తీస్‌గఢ్‌లోని తాడిమెట్ల అటవీప్రాంతంలో మావోయిస్టులు ఏకంగా 76 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లను బలిగొన్నారు. మావోయిస్టు చరిత్రలోనే అతిపెద్ద దాడిగా ఈ ఘటన నిలిచింది. అదే ఏడాది జూన్‌ 29న నారాయణపూర్‌ జిల్లా జగ్దాఘాట్‌ వద్ద 26 మంది సీఆర్పీఎఫ్‌ సిబ్బందిని మట్టుపెట్టారు.
  • 2013 మేలో కాంగ్రెస్‌ ఎన్నికల ర్యాలీపై దాడి చేశారు. సల్వాజుడుం సృష్టికర్త మహేంద్రకర్మ.. దర్భా వ్యాలీలో నిర్వహిస్తున్న ర్యాలీపై ఆయుధాలపై విరుచుకుపడ్డారు. ఈ దాడిలో మహేంద్రకర్మతోపాటు 20 మంది నేతలు, కార్యకర్తలు హతమయ్యారు.
  • 2017 మార్చి 11న డోర్నపాల్‌ అటవీ ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనులకు కాపలా ఉండేందుకు వెళ్తున్న సీఆర్పీఎఫ్‌ బలగాలపై విరుచుకుపడి 12 మంది జవాన్లను హతమార్చారు. ఆ ఏడాది ఏప్రిల్‌లో అదే ప్రాంతంలో 25 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లను కాల్చిచంపారు.
  • 2020 మార్చిలో 17 మంది సీఆర్పీఎఫ్‌ సిబ్బందిని హతమార్చారు.

ఇదీ చదవండి :బీజాపుర్​ ఎన్​కౌంటర్​ అమరులకు ఫ్రాన్స్ సంతాపం

Last Updated : Apr 5, 2021, 8:10 AM IST

ABOUT THE AUTHOR

...view details