'ఆపరేషన్ పోలో', ఆపరేషన్ క్యాటర్ పిల్లర్.. (operation polo) హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం (Telangana liberation day) చేయటానికి భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్‌కు పెట్టిన పేర్లివి! సరిగ్గా 109 గంటల్లో భారత సేన విజయం సాధించింది. అయితే మైదానంలో పోరు కంటే కూడా తెరవెనక తీవ్రమైన దౌత్య యుద్ధమే జరిగింది. భారత్ చకచకా పావులు కదపకపోయుంటే ఆపరేషన్ పోలో (operation polo Hyderabad) కాస్త సుదీర్ఘంగా సాగేదే!
యథాతథస్థితి ఒప్పందం...
వీలైతే హైదరాబాద్‌ను స్వతంత్ర దేశంగా ఉంచటం; లేదంటే పాకిస్థాన్‌లో కలపాలనే ఉద్దేశంతో నిజాం రాజు (nizam of Hyderabad) ఉస్మాన్ మీర్ అలీ ఖాన్-7 ఎత్తులు వేశారు. బ్రిటిష్ ప్రభుత్వంతో ఉన్నట్లే భారత ప్రభుత్వంతో కూడా యథాతథ స్థితి కొనసాగించేలా ఒప్పందానికి సిద్ధమయ్యాడు. బ్రిటిష్ సైన్యాలు హైదరాబాద్‌లో ఉన్నట్లే భారత సైన్యం హైదరాబాద్‌లో(operation polo Hyderabad) ఉండేందుకు దీనివల్ల వీలవుతుంది. కానీ దీన్ని మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఇత్తెహాద్), రజాకార్ల అధినేత ఖాసిం రజ్వీ వ్యతిరేకించారు. నిజాం నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఒకరకంగా నిజాంపై రజ్వీ తిరుగుబాటు చేసినంత పని చేశాడు. దాంతో ఒత్తిడికి తలొగ్గిన నిజాం- హైదరాబాద్‌లో భారత సైన్యం ఉండకుండా షరతు విధించి 1947 నవంబరు 29న భారత గవర్నర్ జనరల్ మౌంట్‌బాటన్‌తో స్టాండ్‌స్టిల్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీనిప్రకారం ఏడాది పాటు విదేశాంగ, రక్షణ, కమ్యూనికేషన్ వ్యవహారాల్లో తప్పిస్తే హైదరాబాద్‌పై నిజాంకే పూర్తి అధికారాలుంటాయి.
విదేశాలతో ఆయుధ బేరాలు..
ఒప్పందాన్ని నిజాం (nizam of Hyderabad) వెంటనే ఉల్లంఘించటం మొదలెట్టాడు. భారత్‌తో సుదీర్ఘ యుద్ధానికి వ్యూహాలు రచించాడు. భారీస్థాయిలో ఆయుధాలు సమకూర్చుకోవటానికి సిద్ధమయ్యాడు. విదేశాంగ వ్యవహారాలు భారత్‌కు కట్టబెట్టినా ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జర్మనీ.. ఇలా అన్ని దేశాలనూ సంప్రదించటం మొదలెట్టాడు. ఇందుకోసం పాకిస్థాన్‌ను మధ్యవర్తిగా వాడుకున్నాడు. పాక్‌కు రహస్యంగా కోటీ 50లక్షల పౌండ్ల రుణం ఇచ్చాడు. దీంతో నిజాం తరఫున ఆయుధాల కొనుగోలుకు పాకిస్థాన్ రంగంలోకి దిగింది. 6లక్షల రైఫిళ్లు, అంతేసంఖ్యలో రివాల్వర్లు, 3లక్షల లైట్ అండ్ హెవీ మెషీన్‌గన్లు ఫ్రాన్స్ నుంచి ఆర్డర్ చేసింది. ఇవన్నీ హైదరాబాద్ కోసమనే విషయం కామన్వెల్త్ రిలేషన్స్ ఆఫీసు (సీఆర్‌ఓ), యూకే విదేశాంగశాఖ ద్వారా లండన్‌లో భారత హైకమిషనర్ కృష్ణ మేనన్‌కు తెలిసింది. దీంతో భారత్ దౌత్యపరంగా ఆయా దేశాలపై ఒత్తిడి పెంచి అడ్డుకుంది.