దేశవ్యాప్తంగా కొవిడ్ ఉద్ధృతి పెరిగిపోతుండటంతో.. మెడికల్ ఆక్సిజన్ కొరత రోజురోజుకూ అధికమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రాణవాయువు విషయంలో రాష్ట్రాల మధ్యన పొరపొచ్చాలు ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఉత్పత్తి అయిన ఆక్సిజన్‌ను తమ అవసరాలు తీరిన తర్వాతనే పొరుగు రాష్ట్రాలకు పంపించాలని భావిస్తున్నాయి. ప్రధాని మోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి రాసిన లేఖ ఈ వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
తమిళనాడు నుంచి తెలుగు రాష్ట్రాలకు వెళ్తున్న 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరాను వెంటనే నిలిపివేయాలని కోరుతూ సీఎం పళనిస్వామి.. ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోందని, ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత వేధిస్తోందని అందువల్ల తమ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్న ప్రాణవాయువును తక్షణమే నిలిపివేయాలని కోరారు. రాష్ట్రంలో 400 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుండగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 310 మెట్రిక్ టన్నులు ఖర్చవుతోందని లేఖలో పర్కొన్నారు. కానీ, కొవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో భవిష్యత్‌లో 450 మెట్రిక్ టన్నుల ప్రాణవాయువు అవసరయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో తెలుగురాష్ట్రాలకు సరఫరా అవుతున్న 80 మెట్రిక్‌టన్నుల సరఫరాను నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని లేఖలో కోరారు.