ఉత్తర్‌ప్రదేశ్ గాజియాబాద్‌లో ఓ ముస్లిం వ్యక్తిపై నలుగురు యువకులు దాడి చేసిన ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ట్విట్టర్లో ఒక క్లిప్పింగ్‌ను షేర్ చేసిన రాహుల్.. ప్రజలను అపఖ్యాతిపాలు చేస్తూ, అవమానించే విధానాలను ప్రభుత్వం మానుకోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు సూచించారు.
"రాముడి నిజమైన భక్తులు ఇలాంటి పని చేస్తారంటే అంగీకరించలేకపోతున్నా. ఇంతటి క్రూరత్వం మానవత్వానికి చాలా దూరం. ఈ ఘటన సమాజం, మతం అనే భావనలకు సిగ్గుచేటు కలిగించేలా ఉంది."
-రాహుల్ గాంధీ ట్వీట్
రాహుల్ ట్వీట్‌పై స్పందించిన యూపీ సీఎం ఆదిత్యనాథ్.. 'పోలీసులు వాస్తవాలు వెల్లడించినప్పటికీ ఈ ఘటనపై విషం చిమ్ముతున్నందుకు రాహుల్ సిగ్గుపడాలి' అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
"రాముడి భక్తులు పాటించాల్సిన మొదటి సూత్రం సత్యం పలకడం. అది మీరు జీవితంలో ఎన్నడూ చేయలేదు. అధికారంలోకి రావాలనే దురాశతో.. మానవత్వమే సిగ్గుపడేలా చేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలను అవమానించడం, వారి పరువు తీయడం మానుకోవాలి."
-యోగి ఆదిత్యనాథ్
ఇదీ చదవండి:'టీకా పంపిణీ విధానమే సరిగా లేదు'
ఇదీ చదవండి:Vaccine: 'ఉచితం అంటూ.. వసూళ్లు ఏంటి?'
వివాదానికి కారణమిదే..
గాజియాబాద్‌కు చెందిన సూఫీ అబ్దుల్ సమద్ అనే ముస్లిం వృద్ధుడిని నలుగురు వ్యక్తులు తీవ్రంగా కొడుతూ, గడ్డం కత్తిరిస్తూ 'జై శ్రీ రామ్' నినాదాలు చేయాలని బెదిరిస్తున్నట్లు ఉన్న ఓ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మరోవైపు సదరు వృద్ధుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. తన గడ్డం కత్తిరించిన విషయాన్ని ప్రస్తావించలేదు. అయితే.. 'జై శ్రీ రామ్' నినాదాలు చేయాల్సిందిగా బలవంతం చేసినట్లు పేర్కొన్నాడు.
'దాడికి కారణం వేరు..'
మతపరమైన కోణంలో ఈ దాడి జరిగిందన్న వాదనను గాజియాబాద్ పోలీసులు తోసిపుచ్చారు. సూఫీ అబ్దుల్ సమద్ అనే వృద్ధుడి వద్ద తాయత్తులు తీసుకున్న హిందూ-ముస్లిం వర్గాలకు చెందిన ఆరుగురు వ్యక్తుల బృందం ఈ దాడికి పాల్పడిందని స్పష్టం చేశారు. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వకుండా ట్విట్టర్ చర్యలు చేపట్టలేదని ఆరోపిస్తూ.. ఆ సంస్థపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
"వివిధ రకాల జబ్బులను నయం చేస్తానని చెప్పి సమద్.. తాయత్తులు విక్రయిస్తూంటాడు. ఈ క్రమంలోనే రోగాల బారిన పడిన తన కుటుంబ సభ్యుల కోసం గుర్జర్ అనే వ్యక్తి కొన్ని తాయత్తులను కొన్నాడు. ఆశించిన ఫలితం రాలేదనే కోపంలో ఇతరులతో కలసి దాడికి దిగాడు."
-ఇరాజ్ రాజా, ఎస్పీ
ఈ ఘటనకు కారణమైన యువకులను గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. పర్వేష్ గుర్జర్‌తో పాటు.. కల్లూ, ఆదిల్ పాలీ, ఆరిఫ్, ముషాహిద్లను అరెస్టు చేసినట్లు తెలిపారు.
ఇవీ చదవండి:'రాముడి పేరున అక్రమాలు సరికాదు'
'అబద్ధాలు ప్రచారం చేసే రహస్య మంత్రిత్వ శాఖ'