Stock Market Close:రెండు వరుస సెషన్ల భారీ లాభాల అనంతరం.. స్టాక్ మార్కెట్లు వారాంతంలో నష్టపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ 715 పాయింట్లు పడిపోయింది. చివరకు 57 వేల 197 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 221 పాయింట్లు కోల్పోయి.. 17 వేల 172 వద్ద సెషన్‌ను ముగించింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు.. దేశీయ సూచీలను కోలుకోనివ్వకుండా చేశాయి. ఆసియా, అమెరికా, ఐరోపా మార్కెట్లు కూడా అన్నీ ప్రతికూలంగానే ట్రేడయ్యాయి.
సెన్సెక్స్ ఓ దశలో 770 పాయింట్లకుపైగా పతనంతో 57 వేల 135 వద్ద సెషన్ కనిష్ఠాన్ని తాకింది. తొలుత దాదాపు 400 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. లోహం, ఆర్థిక రంగం షేర్లు కుదేలయ్యాయి. విద్యుత్ షేర్లు మినహా దాదాపు అన్నీ డీలాపడ్డాయి. ఆఖరి గంటలో అమ్మకాలతో మార్కెట్ల నష్టాలు మరింత పెరిగాయి. అదానీ పోర్ట్స్, ఎం అండ్ ఎం, మారుతీ సుజుకీ, హెచ్‌సీఎల్ టెక్, ఐటీసీ లాభపడ్డాయి. హిందాల్కో, సిప్లా, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నష్టపోయాయి. సెన్సెక్స్ గత సెషన్లో 874 పాయింట్లు, నిఫ్టీ 256 పాయింట్లు పెరగడం విశేషం.
ఇవీ చూడండి:క్రెడిట్, డెబిట్ కార్డ్స్‌కు కొత్త రూల్స్.. అలా జరిగితే కస్టమర్‌కు రోజుకు రూ.500!