తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మృత్యు బావికి 35 మంది భక్తులు బలి.. 'ఇదేంటి రామా?'.. అంటూ కుటుంబీకుల తీవ్ర ఆవేదన!

మధ్యప్రదేశ్‌ ఇందౌర్‌లో జరిగిన ఘోర విషాదంలో.. మరణించిన వారి సంఖ్య 35కి పెరిగింది. పటేల్‌నగర్‌ ప్రాంతంలోని మహదేవ్‌ జులేలాల్‌ ఆలయంలో బావిపై వేసిన స్లాబ్‌కూలి.. అందులో పడిపోయిన వారిలో 35 మంది మరణించారని అధికారులు తెలిపారు. మరికొందరి ఆచూకీ లభించలేదని.. వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశామని వెల్లడించారు. ప్రమాదం తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ.. రెండు లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు.

indore stepwell accident
indore stepwell accident

By

Published : Mar 31, 2023, 12:08 PM IST

మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో మహదేవ్‌ జులేలాల్‌ ఆలయంలో బావిపై వేసిన స్లాబ్‌ కూలిన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రమాదంలో ఇప్పటివరకు.. 35 మంది భక్తులు మరణించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 35 మంది చనిపోయారని.. 14 మందిని సురక్షితంగా రక్షించామని ఇందౌర్‌ కలెక్టర్‌ ఇళయరాజా తెలిపారు. ఇద్దరు వ్యక్తులు చికిత్స తర్వాత డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపారు. ఆచూకీ లభించని వారి కోసం ఆపరేషన్‌ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

ఇందౌర్‌లో మహదేవ్‌ జులేలాల్‌ ఆలయంలో చాలా కట్టడాలు శిథిలావస్థకు చేరాయని.. తాము ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని స్థానికులు ఆరోపించారు. తమ ఫిర్యాదులపై స్పందించి ఉంటే ఇంతటి ప్రమాదం జరిగేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని.. రెండు లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.. క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం ప్రకటించారు.

సహాయక చర్యల దృశ్యాలు
సహాయక చర్యల దృశ్యాలు

ఇందౌర్‌లో మహదేవ్‌ జులేలాల్‌ ఆలయంలో ప్రమాదంపై.. సీఎం శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ న్యాయ విచారణకు ఆదేశించారు. ప్రమాదం జరిగిన ఆలయాన్ని ఆయన మంత్రులతో కలిసి పరిశీలించారు. ఈ ప్రమాదం తనను తీవ్రంగా కలచి వేసిందన్న సీఎం... ఈ దుర్ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించినట్లు స్పష్టం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని.. సీఎం పరామర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా మెట్ల బావులు, ప్రమాదకర బావులను తక్షణం తనిఖీ చేయాలని సీఎం ఆదేశించారు.

మధ్యప్రదేశ్‌ ఇందౌర్‌లో నాలుగు దశాబ్దాల క్రితం మెట్ల బావిని కప్పి బేలేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి శ్రీరామనవమి సందర్భంగా భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఒక బావిపై స్లాబ్‌వేసి ఈ దేవాలయాన్ని నిర్మించడంతో భక్తుల రద్దీ కారణంగా ఆ ఫ్లోరింగ్‌ కూలింది. ఈ ప్రమాదంలో భక్తులు అందరూ బావిలో పడిపోయారు. నిచ్చెన, తాళ్ల సాయంతో 14 మంది భక్తులను బయటకు తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. బావి లోతు 50 అడుగుల పైనే ఉన్నట్లు తెలుస్తోంది.

ఆలయ సిబ్బంది పై కేసు నమోదు..
ఈ విషాద ఘటనకు సంబంధించి.. మహదేవ్‌ జులేలాల్‌ ఆలయ కమిటీ అధ్యక్షుడు, కార్యదర్శిపై కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్ 304 కింద పోలీసులు కేసు నమోదు​ చేశారు. ఈ విషయాన్ని ఇందౌర్​ సీపీ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details