steel glass in private part: బిహార్ పట్నాలోని పీఎంసీహెచ్ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. ఓ మధ్యవయస్కుడైన వ్యక్తి రహస్య భాగాల్లో ఇరుక్కున్న స్టీల్ గ్లాస్‌ను వైద్యులు చాకచక్యంగా తొలగించారు. నవాదా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ప్రైవేటు భాగాల్లో స్టీల్ గ్లాస్ ఇరుక్కుంది. ఆయనకు నొప్పి తీవ్రంగా మారింది. బాధితుడి కుటుంబ సభ్యులు అతడిని పీఎంసీహెచ్ ఆస్పత్రిలో శుక్రవారం చేర్పించారు. డాక్టర్ వినయ్ కుమార్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల వైద్య బృందం విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించింది.
స్టీల్ గ్లాసు.. బాధితుడి మలద్వారంలో చాలా లోతుకు వెళ్లిందని వైద్యులు తెలిపారు. ఎక్స్‌రేలో ఈ విషయం స్పష్టంగా తెలిసిందని చెప్పారు. మలద్వారం నుంచి గ్లాసును వెనక్కి తీయడం సాధ్యం కాలేదని తెలిపారు. అందుకే పొట్టకు ఆపరేషన్ నిర్వహించి గ్లాసును బయటకు తీసినట్లు స్పష్టం చేశారు. ఆపరేషన్ పూర్తైన తర్వాత బాధితుడిని పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు. కొద్దిగంటల తర్వాత ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలించినట్లు వివరించారు.