దేశంలో మే 7న నమోదైన రికార్డు స్థాయి కేసులతో పోలిస్తే ప్రస్తుతం 68శాతం మేర కేసులు క్షీణించాయని ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ అన్నారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా సాగుతుందన్న ఆయన 60ఏళ్లు పైబడిన 43శాతం మందికి, 45 నుంచి 60ఏళ్ల మధ్య ఉన్న 37శాతం మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు చెప్పారు.
అమెరికాను మించి..
దేశంలో ఇప్పటివరకు 17.2కోట్ల మంది కనీసం ఒక డోసు తీసుకున్నారని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అన్నారు. తొలి డోసు టీకాల విషయంలో అమెరికాను అధిగమించినట్లు ఆయన పేర్కొన్నారు. దేశంలో రోజువారీ కేసుల్లో 66శాతం 5 రాష్ట్రాల్లోనే నమోదవుతున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. 377 జిల్లాల్లో 5శాతం లోపే పాజిటివిటీ రేటు ఉన్నట్లు చెప్పింది. 257జిల్లాల్లో నిత్యం వందకు పైగా కేసులు వస్తున్నట్లు చెప్పిన ఆరోగ్యశాఖ మరో 100 జిల్లాల్లో నిరంతరం కేసులు తగ్గుతున్నట్లు పేర్కొంది.