తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'యాత్రల కాలంలో కొవిడ్‌పై జాగ్రత్త'.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ - కరోనా కేసుల పెరుగుదల కేంద్రం లేఖ

Covid cases rise in india: దేశవ్యాప్తంగా యాత్రలు, ఉత్సవాలు ప్రారంభం కానున్న తరుణంలో కరోనా వ్యాపించకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్రం ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది. రాష్ట్రాల్లో యాత్రలు, ఉత్సవాలు నిర్వహించేటప్పుడు అనుసరించాల్సిన జాగ్రత్తలను అందులో నిర్దేశించారు.

covid cases hike
covid cases hike

By

Published : Jun 29, 2022, 9:30 AM IST

Covid cases rise in india: "రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉత్సవాలు, యాత్రలు ప్రారంభం కాబోతున్నాయి. వీటి కోసం లక్షల మంది సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఇలాంటి సమ్మేళనాలు కొవిడ్‌ సహా ఇతర అంటువ్యాధుల వ్యాప్తికి దోహదం చేసే ప్రమాదం ఉన్నందున రాష్ట్రాలు అప్రమత్తంగా వ్యవహరించాలి. టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌, వ్యాక్సినేషన్‌, కొవిడ్‌ అనుగుణ ప్రవర్తన అన్న అయిదంచెల వ్యూహాన్ని అమలుచేయాలి" అని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈమేరకు ఆయన మంగళవారం లేఖ రాశారు. రాష్ట్రాల్లో యాత్రలు, ఉత్సవాలు నిర్వహించేటప్పుడు అనుసరించాల్సిన జాగ్రత్తలను అందులో నిర్దేశించారు.

  1. యాత్రలు, ఉత్సవాల్లో కొవిడ్‌ లక్షణాలు లేనివారు, పూర్తిగా వ్యాక్సిన్‌ తీసుకొన్నవారు మాత్రమే పాల్గొనేలా ప్రజలను అప్రమత్తం చేయాలి. అవసరమైతే ప్రత్యేక వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను నిర్వహించాలి. యాత్రల్లో పాల్గొనేవారిలో అర్హులైనవారందరికీ కనీసం పక్షం రోజుల ముందు బూస్టర్‌ డోస్‌ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. కొవిడ్‌ పరీక్ష చేయించుకునే సౌకర్యం ఏర్పాటుచేయాలి.
  2. కొవిడ్‌ లక్షణాలు లేని, పూర్తిస్థాయి వ్యాక్సినేషన్‌ పూర్తయిన సిబ్బందిని మాత్రమే విధుల్లో నియమించాలి.
  3. వయోజనులకు మధుమేహం, బీపీ, ఊపిరితిత్తులు, కిడ్నీ, కాలేయ సంబంధ సమస్యలు ఉంటే ఈ ఉత్సవాలు జరిగినన్ని రోజులు మందులు తీసుకొనేలా అప్రమత్తం చేయాలి.
  4. యాత్రలు జరిగే మార్గాల్లోని వ్యక్తులకు వైద్య సేవలు అందించే ఏర్పాటుచేయాలి.
  5. యాత్రికులు చేరుకొనే ప్రధాన గమ్యస్థానాలు, విశ్రాంతి తీసుకొనే ప్రాంతాల్లో కొవిడ్‌ పరీక్షలు నిర్వహించేందుకు హెల్త్‌ డెస్క్‌లు ఏర్పాటుచేయాలి. రోగులను సమీప ఆసుపత్రులకు తరలించేందుకు రవాణా సౌకర్యాన్ని అందుబాటులో ఉంచాలి.
  6. అన్ని ప్రాంతాల్లో భక్తులు కొవిడ్‌ నిబంధనలు పాటించేలా అప్రమత్తం చేయాలి.
  7. యాత్రలు కొనసాగే ప్రాంతాల్లో ప్రార్థనలు, సీటింగ్‌, లాడ్జింగ్‌ ఏర్పాట్లు బహిరంగ ప్రాంతాల్లో కానీ, గాలి, వెలుతురు ఉండే చోట్లకానీ జరిగేలా చూడాలి. థర్మల్‌ స్క్రీనింగ్‌, చేతులు శుభ్రం చేసుకొనే వ్యవస్థలు ఏర్పాటుచేయాలి.
  8. ప్రజలు తరచూ తాకే హ్యాండ్‌ రెయిల్స్‌, క్యూ బారికేడ్స్‌, సీట్లు, బెంచీలు, మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు చర్యలు తీసుకోవాలి.
  9. రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్‌తో సహా ఇతర అంటువ్యాధులపై దృష్టిసారించాలి. కొవిడ్‌ కేసులను అరికట్టడానికి చర్యలు చేపట్టాలి.
  10. ప్రస్తుతం ఆసుపత్రుల్లో ఉన్న పడకల సామర్థ్యాన్ని, మానవ వనరులను, మందులు, ఆక్సిజన్‌, ఇతర పరికరాలను, అంబులెన్స్‌ వ్యవస్థనూ పెంచాలి.

కేసులపై నిఘా పెంచండి: కొవిడ్‌ కేసులపై నిరంతరం అప్రమత్తతతో వ్యవహరించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత(యూటీ) ప్రాంతాలకు కేంద్రం సూచించింది. కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో ఆసుపత్రుల్లో చేరిన కొవిడ్‌ బాధితుల వైద్య నివేదికలను సునిశితంగా పరిశీలించాలని, లక్షణాలను సవివరంగా తెలిపేలా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు నివేదికలు అందించాలని సూచించింది. దీనివల్ల బాధితుల్లో ఏవైనా అసాధారణ లక్షణాలు కనిపిస్తే ప్రారంభ దశలోనే గుర్తించడానికి వీలవుతుందని పేర్కొంది. ఈ మేరకు కొవిడ్‌ కేసుల్లో పెగురుదల కనిపిస్తున్న తెలంగాణ సహా 14 రాష్ట్రాలు, యూటీల అధికారులతో కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ మంగళవారం వీడియో ద్వారా సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌ పరీక్షలు పెంచాలని, అర్హులైన వారందరికీ వ్యాక్సిన్‌, బూస్టర్‌ డోసులు పంపిణీ చేయాలని సూచించారు.

ఇదీ చదవండి:ఐదేళ్ల బాలికపై ఇద్దరు మైనర్ల అత్యాచారం.. చెరకు తోటలోకి తీసుకెళ్లి..

ABOUT THE AUTHOR

...view details