తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆక్సిజన్, రెమ్​డెసివిర్, టీకా కొరతపై రాష్ట్రాల ఫిర్యాదు! - supply of oxygen cylinder, Remdesivir to hospitals

కరోనా కేసులు భారీగా పెరుగుతున్న రాష్ట్రాలతో సమీక్షా సమావేశం నిర్వహించింది కేంద్ర ఆరోగ్య శాఖ. వైద్య పరికరాలు సహా టీకాలను సరఫరా చేయాలని ఈ సందర్భంగా రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. కరోనా కట్టడి విషయంలో నెలకొన్న సమస్యలను కేంద్రానికి వివరించాయి. దీనిపై ప్రకటన విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ.. ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.

CENTRE STATES MEETING
టీకా కొరతపై రాష్ట్రాల ఫిర్యాదు

By

Published : Apr 17, 2021, 6:40 PM IST

ఆక్సిజన్ సిలిండర్లు, ఆస్పత్రులకు రెమ్​డెసివిర్ ఔషధాలు, వెంటిలేటర్లు, వ్యాక్సిన్ డోసులను సరఫరా చేయాలని రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో కేంద్రం నిర్వహించిన సమావేశంలో.. ఈ మేరకు 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ సమస్యలను ప్రస్తావించాయి.

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అధ్యక్షతన ఈ సమీక్షా సమావేశం జరిగింది. కేసులు గణనీయంగా పెరుగుతున్న మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, కేరళ, బంగాల్, దిల్లీ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్​ప్రదేశ్ రాష్ట్రాల అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు.

అదనపు పడకల కోసం దిల్లీ

సమావేశం అనంతరం అధికారిక ప్రకటన విడుదల చేసిన కేంద్ర వైద్య శాఖ... బ్లాక్ మార్కెట్​లో విచ్చల విడి రేట్లకు రెమ్​డెసివిర్​ను విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు కోరినట్లు తెలిపింది. మహారాష్ట్రలో డబుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్ ఆందోళనకరంగా మారిందని పేర్కొంది. కేంద్రం అధీనంలో ఉన్న ఆస్పత్రుల్లో అదనపు పడకలు ఏర్పాటు చేయాలని దిల్లీ ప్రభుత్వం కోరినట్లు వెల్లడించింది. కొవిడ్ నియంత్రణ కోసం రాష్ట్ర విపత్తు స్పందన నిధుల్లో 50 శాతం ఉపయోగించుకునేలా అనుమతిస్తూ కేంద్ర హోంశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ సహా నేషనల్ హెల్త్ మిషన్ కింద ఖర్చు చేయని నిధులను వినియోగించుకునేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఉత్తర్వులు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిపింది.

కేంద్రం స్పందన

మెడికల్ ఆక్సిజన్ సరఫరాతో పాటు రెమ్​డెసివిర్ అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్రాలకు భేటీ సందర్భంగా వివరించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. దేశంలోని వివిధ తయారీదారుల నుంచి ఆక్సిజన్ సరఫరా కోసం రూపొందించిన క్యాలెండర్​ గురించి రాష్ట్రాలకు వివరించినట్లు చెప్పారు. తయారీ కేంద్రాల నుంచి ఆక్సిజన్ సరఫరా సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

డోసులకు కొరత లేదు: వర్ధన్

కొవిడ్ ఆస్పత్రులు, ఆక్సిజన్ సదుపాయం ఉన్న పడకల సంఖ్యను పెంచాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సూచించారు. ఐదు, ఆరు నగరాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని పేర్కొన్నారు. ఈ నగరాలకు లేదా పక్కన ఉన్న రెండు, మూడు జిల్లాలకు ఓ మెడికల్ కాలేజీని అనుసంధానించాలని చెప్పారు. మహారాష్ట్రకు 1,121 వెంటిలేటర్లు, యూపీకి 1,700, ఝార్ఖండ్​కు 1500, గుజరాత్​కు 1600, మధ్యప్రదేశ్​కు 152, ఛత్తీస్​గఢ్​కు 230 వెంటిలేటర్లను సరఫరా చేయనున్నట్లు చెప్పారు.

ఇప్పటివరకు 14.15 కోట్ల టీకా డోసులను సరఫరా చేయగా.. వృథా అయిన వాటితో కలిపి 12.57 కోట్ల డోసులను వినియోగించినట్లు హర్షవర్ధన్ తెలిపారు. 1.58 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే వారం లోపు 1.16 డోసులను సరఫరా చేయనున్నట్లు చెప్పారు. చిన్న రాష్ట్రాలకు ఏడు రోజులకు, పెద్ద రాష్ట్రాలకు నాలుగు రోజులకు ఓసారి డోసులను పంపిస్తున్నట్లు వివరించారు. టీకా డోసులకు కొరత లేదని, వ్యాక్సినేషన్​ను ముమ్మరం చేయాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:భారత్​లో ఈ టీకాలకు అత్యవసర అనుమతి లభించేనా?

ABOUT THE AUTHOR

...view details