దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 80శాతానికి పైగా 10 రాష్ట్రాల్లోనే బయటపడుతూ ఉండగా.. ఆయా ప్రభుత్వాలు క్రమంగా కర్ఫ్యూ, లాక్‌డౌన్ సహా కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. మహారాష్ట్ర, దిల్లీ, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు వైరస్ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆ దిశగా నిర్ణయం తీసుకోగా... మరికొన్ని రాష్ట్రాలు కూడా అదే బాటలో నడిచాయి. మధ్యప్రదేశ్‌లోని అన్ని పట్టణాల్లో శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకు లాక్‌డౌన్ అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా తీవ్రతపై గురువారం సమీక్షా సమావేశం నిర్వహించిన ఆ రాష్ట్ర సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్.. ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
యూపీలో రాత్రి కర్ఫ్యూ
ఉత్తరప్రదేశ్ గురువారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది. రాజధాని లఖ్‌నవూ, వారణాసి, కాన్పూర్‌లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు, గాజియాబాద్, నోయిడాలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించారు. ఈ రెండు పట్టణాల్లో ఏప్రిల్ 17 వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.
తమిళనాట కఠిన ఆంక్షలు
కొవిడ్ కేసులు పెరుగుతున్న వేళ తమిళనాడు కఠిన ఆంక్షలను అమలు చేయనుంది. ఏప్రిల్ 10 నుంచి వివిధ రకాల ఆంక్షలను అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చెన్నైలోని కోయంబేడు వంతెనపై వాహన రాకపోకలను నిలిపివేస్తారు. చెన్నై సహా జిల్లాల మధ్య నడిచే బస్సుల్లో సిటింగ్ సామర్థ్యం మేరకే ప్రయాణికులను అనుమతిస్తారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పుదుచ్చేరికి నడిచే బస్సులకు కూడా ఇదే నిబంధన వర్తించనుంది.
ఇదీ చూడండి:'టీకా వేసుకోండి.. రూ.5లక్షలు గెలుచుకోండి'
తమిళనాడులో షాపింగ్ మాళ్లు, సూపర్ మార్కెట్‌లు, సినిమా హాళ్లు, కూరగాయల మార్కెట్‌లు, హోటళ్లు, టీ దుకాణాలలో వినియోగదారులను పరిమితంగా అనుమతిస్తారు. రాజకీయ, మతపరమైన, విద్యా, సామాజిక, ఇండోర్ క్రీడలకు 200 మందిని మాత్రమే అనుమతిస్తారు. వివాహాలకు వంద మందిని, అంత్యక్రియలకు 50 మందిని మాత్రమే అనుమతించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.