కరోనా ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు ఆంక్షలను కట్టుదిట్టం చేశాయి, పలు చోట్ల లాక్డౌన్ కూడా అమలు కానుంది.
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్ జిల్లాలో 10 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఈనెల 9న సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై 19వ తేదీ ఉదయం 6 వరకు లాక్డౌన్ ఉంటుందని ప్రకటనలో పేర్కొంది. వైరస్ విజృంభిస్తుండటం వల్ల ప్రజలను కట్టడి చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
లాక్డౌన్ సమయంలో మందుల దుకాణాలు మినహా మిగతా అన్ని షాపులు, వాణిజ్య కేంద్రాలు మూసివేయలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, బ్యాంకులు కూడా మూతపడతాయని వెల్లడించింది. టెలికాం, రైల్వే, విమానాశ్రయాలకు మాత్రమే మినహాయింపు ఇస్తున్నామని పేర్కొంది. బహిరంగ సమావేశాలు, మత, సాంస్కృతిక కార్యక్రమాలను నిషేధించింది.
దిల్లీలో రాత్రి కర్ఫ్యూ
వైరస్ వ్యాప్తి దృష్ట్యా దిల్లీలో రాత్రి కర్ఫ్యూను అమలు చేసింది కేజ్రీవాల్ సర్కార్. మంగళవారం నుంచి అమలులోకి వచ్చిన ఈ కర్ఫ్యూ ఈనెల 30 వరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల మధ్య ఈ ఆంక్షలు ఉంటాయని పేర్కొంది.
కర్ఫ్యూ వేళల్లో.. వ్యాక్సిన్ కోసం పంపిణీ కేంద్రాల వద్దే రిజిస్టర్ కావాలనుకునేవారు ముందుగా ఈ-పాస్ తీసుకోవాలని స్పష్టం చేసింది దిల్లీ ప్రభుత్వం. ఈ-పాస్ ఉంటేనే బయటకు వెళ్లేందుకు వారికి అనుమతి లభిస్తుందని తెలిపింది. కొవిన్ యాప్ ద్వారా రిజిస్టర్ అయిన వారు సంబంధిత మెసేజ్‌ను చూపిస్తే సరిపోతుందని పేర్కొంది.