తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలను, మహిళలను గుర్తించేందుకు కేంద్రం పలు కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. చిన్న పిల్లల్లో ఎక్కువ మంది దీని బారిన పడుతున్నారని భావించిన ప్రభుత్వం.. అలాంటి వారిని సంబంధిత ఆసుపత్రుల్లో చేర్పించాలని రాష్ట్రాలకు సూచించింది. 'పోషన్ ట్రాకర్' ద్వారా వారి బాగోగులను పర్యవేక్షించాలని కోరింది. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది.
పోషకాహార లోపంపై కేంద్రం కీలక మార్గదర్శకాలు - సామాజిక భోజనశాలలు
పోషకాహార లోపంపై పోరాడేందుకు కేంద్రం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. తీవ్ర పోషకాహార లోపంతో బాధపడేవారిని గుర్తించి.. తగిన వైద్య చికిత్సలు చేయించాలని రాష్ట్రాలను కోరింది. ఈ కార్యక్రమాన్ని 'పోషన్ ట్రాకర్' అనే యాప్ ద్వారా చేపట్టాలని సూచించింది.
పోషకాహార లోపంపై కేంద్రం కీలక మార్గదర్శకాలు
లేఖలోని ప్రధానాంశాలు
- పోషకాహార బాధితులను గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి. అలా గుర్తించిన వారిని అవసరమైన మేరకు ఆసుపత్రుల్లో చేర్పించాలి. ఆ ప్రక్రియ అంతా జనవరి 31లోపే జరగాలి.
- నిర్ణీత వ్యవధిలోగా పోషకాహార లోపంతో ఇబ్బందిపడుతోన్న వారిని గుర్తించి వైద్యసాయం అందించాల్సిన అవసరాన్ని లేఖలో వివరించింది.
- బాధితులకు కేంద్రం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాల ప్రకారం పోషకాహారాన్ని అందించాలి. పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడం, సమగ్ర నిర్వహణ అంతా 'పోషన్ ట్రాకర్' యాప్ ద్వారా చేపట్టాలి.
- సమాచార సేకరణకు 'పోషన్ ట్రాకర్' యాప్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలి. సంబంధిత సమాచారాన్ని వివిధ మంత్రిత్వ శాఖలు ఉపయోగించుకుని ఇతర కార్యక్రమాలను రూపొందించవచ్చని కేంద్రం తెలిపింది.
- పోషన్ ట్రాకర్‌ను ఉపయోగించడం ద్వారా ప్రతి లబ్ధిదారునికి డిజిటల్ గుర్తింపు లభిస్తుంది. వారివారి ఆరోగ్య పరిస్థితులను బట్టి హెచ్చరికలను జారీ చేస్తుంది. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వం వద్ద కచ్చితమైన డేటా ఉంటుందని కేంద్రం పేర్కొంది.
- పోషకాహార బాధితులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో సామాజిక వంటశాలలను ఏర్పాటు చేయాలని సూచించింది. దీని ద్వారా మహిళలకు, వీధి బాలలకు లబ్ధి చేకూరుతుందని స్పష్టం చేసింది.
- ఆయుష్‌లో భాగంగా ఉన్న అంగన్వాడీలు లబ్ధిదారులకు ఇంటి వద్దనే.. 'యోగా ఎట్ హోమ్, యోగా విత్ ఫ్యామిలీ' కార్యక్రమాలకు ప్రచారం కల్పించాలని సూచించింది.
ఇదీ చూడండి: పేదలకేదీ పోషకాహారం? భారతీయుల్లో కొరవడిన కండర పుష్టి