జమ్ముకశ్మీర్‌కు సరైన సమయంలో రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. 2021- జమ్ముకశ్మీర్ పునర్‌వ్యవస్ధీకరణ సవరణ బిల్లును కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి లోక్‌సభలో ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. దీనిపై జరిగిన చర్చకు సమాధానమిచ్చిన హోం మంత్రి అమిత్ షా.. ఈ బిల్లుకు అర్ధం జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇవ్వకపోవడం కాదని స్పష్టతనిచ్చారు.
"జమ్ముకశ్మీర్ పునర్‌వ్యవస్ధీకరణ సవరణ బిల్లు తీసుకురావడం అంటే అర్ధం.. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా రాకపోవడమే అని కొందరు సభ్యులు అన్నారు. బిల్లు ప్రక్రియకు నేను నాయకత్వం వహిస్తున్నాను. నేనే బిల్లును తీసుకువస్తున్నాను. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా రాదని ఈ బిల్లులో ఎక్కడా రాసిలేదన్న విషయాన్ని నేను స్పష్టంగా చెప్పాను. మీరు(కొందరు సభ్యులు) ఏ సమాచారం ఆధారంగా ఈ మాట అంటారు. మీ మనసులోని అనుమానాలను జమ్ముకశ్మీర్ ప్రజలపైకి ఎందుకు వదులుతారు. జమ్ముకశ్మీర్ పునర్‌వ్యవస్ధీకరణ సవరణ బిల్లుతో జమ్ముకశ్మీర్ రాష్ట్రహోదా అంశానికి ఎలాంటి సంబంధం లేదని నేను ఇదే సభలో చెప్పాను, ఇప్పుడు మళ్లీ చెబుతున్నాను. సరైన సమయంలో జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా వస్తుంది."
--అమిత్ షా, కేంద్ర హోం శాఖ మంత్రి