"దేశంలో ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న మధుమేహాన్ని సమర్థవంతంగా నియంత్రించాలనుకుంటే ప్రభుత్వం పెద్ద స్థాయిలో స్పందించాలి. సమగ్ర ప్రణాళికను రూపొందించాలి. చైతన్య కార్యక్రమాలు చేపట్టాలి. వీటన్నిటినీ ఉచిత సార్వత్రిక ప్రజారోగ్య వ్యవస్థతో అనుసంధానం చేయాలి. కేవలం వ్యక్తులకు వదిలేస్తే మనం ఎప్పటికీ లక్ష్యాలను చేరుకోలేం. రోగ నియంత్రణకు ఉచిత సార్వత్రిక ప్రజారోగ్య వ్యవస్థకు మించిన ప్రత్యామ్నాయం లేదన్న వాస్తవాన్ని గ్రహించాలి" అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ తెలిపారు.
'సార్వత్రిక ఉచిత వైద్యవ్యవస్థే ఉత్తమం' - సుప్రీంకోర్టు
ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న మధుమేహాన్ని సమర్థవంతంగా నియంత్రించాలంటే.. ప్రభుత్వం పెద్ద స్థాయిలో స్పందించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. అలాగే సమగ్ర ప్రణాళికను రూపొందించాలని.. చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు.
గురువారం డాక్టర్స్ డే సందర్భంగా 'రీసెర్చ్ సొసైటీ ఫర్ ద స్టడీ ఆఫ్ డయాబెటిస్ ఇన్ ఇండియా (ఆర్‌ఎస్‌డీఐ) సంస్థ' నిర్వహించిన 'మధుమేహాన్ని ఓడిద్దాం' అనే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. "మధుమేహం అవకాశవాద హంతకి. ఇది అన్ని వయసుల ప్రజలపై ప్రభావం చూపుతోంది. మధుమేహాన్ని నియంత్రించడానికి శాస్త్రీయ పరిశోధనలు జరగాలి. గ్రామీణ ప్రాంతాల్లో దీని తీవ్రత గురించి తెలిసిన వారు శూన్యం. పొగాకు, పోలియో వ్యతిరేక ఉద్యమాల తరహాలో మధుమేహంపైనా ప్రచారం చేపట్టాలి. వైద్యపరమైన మౌలిక వసతులు పెంచాలి" అని జస్టిస్ రమణ స్పష్టం చేశారు. "వైద్యులు ప్రత్యక్ష దైవాలు. కరోనా రెండో ఉద్ధృతికి 798 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయినట్లు ఐఎంఏ గణాంకాలు చెబుతున్నాయి. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ యోధులందరికీ శాల్యూట్ చేస్తున్నా" అని జస్టిస్ రమణ తెలిపారు.
ఇదీ చూడండి:'ప్రచారానికి దూరంగా పనిచేయాలి'