తెలంగాణ

telangana

ETV Bharat / bharat

CID Attaches CBN House: చంద్రబాబు నివాసం జప్తు!.. సీఐడీకి అనుమతి ఇస్తూ హోం శాఖ ఉత్తర్వులు

Permission to CID to Attach Chandrababu House: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివసిస్తున్న ఇంటిని జప్తు చేసేందుకు C.I.D.కి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని కరకట్ట రోడ్డుపై లింగమనేని రమేష్‌కు చెందిన ఇంట్లో కొన్నేళ్లుగా చంద్రబాబు అద్దెకు ఉంటున్నారు. చంద్రబాబు , మాజీ మంత్రి నారాయణ.. రాజధాని మాస్టర్ ప్లాన్ , ఇన్నర్ రింగ్ రోడ్ డిజైనింగ్ లో మార్పులు చేసి లింగమనేని రమేశ్‌కు లబ్ధి చేకూర్చారన్నది సీఐడీ ఆరోపణ. విజయవాడ A.C.B. కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు C.I.D.కి ప్రభుత్వం అనుమతినిచ్చింది .

CID Attaches CBN House
CID Attaches CBN House

By

Published : May 15, 2023, 9:41 AM IST

చంద్రబాబు నివాసం జప్తు!.. సీఐడీకి అనుమతి ఇస్తూ హోం శాఖ ఉత్తర్వులు

CID Attaches Chandrababu House: రాజధాని నగర బృహత్‌ ప్రణాళిక డిజైనింగ్, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్, కంతేరు, కాజ, నంబూరు గ్రామాల ప్రాంతీయాభివృద్ధి ప్రణాళికల ద్వారా లింగమనేని ఆస్తులు, భూముల విలువ పెరగడానికి చంద్రబాబు దోహదపడ్డారని... తద్వారా వారికి అనుచిత లబ్ధి కలిగించారని సీఐడీ అభియోగం మోపింది. అందుకు ప్రతిగా.. క్విడ్‌ ప్రో కో కింద చంద్రబాబుకు లింగమనేని రమేష్‌ తన ఇంటిని ఉచితంగా ఇచ్చేశారనేది సీఐడీ ఆరోపణ. ఆ ఇంటిని జప్తు చేసేందుకు సీఐడీకి అనుమతిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి పి.నారాయణ.. బినామీల పేరిట కొన్న ఆస్తులుగా పేర్కొంటూ మరికొన్నింటిని జప్తు చేసేందుకూ అనుమతి జారీ చేసింది. ఈ మేరకు విజయవాడలోని A.C.B. కేసులు ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసేందుకు C.I.D. దర్యాప్తు అధికారికి అనుమతులిచ్చింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌కుమార్‌ గుప్తా ఈ నెల 12న జారీ చేసిన 2 ఉత్తర్వులు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

14మందిని నిందితులుగా పేర్కొంటూ:రాజధాని నగర బృహత్‌ ప్రణాళిక డిజైనింగ్, ఇన్నర్‌రింగ్‌ రోడ్డు ఎలైన్‌మెంట్‌ వంటి అంశాల్లో గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు, అవినీతి చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై గత సంవత్సరం మే 9న ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు, మాజీమంత్రి పి.నారాయణ, లింగమనేని రమేష్‌ సహా 14 మందిని నిందితులుగా పేర్కొంది. ఈ కేసులోనే ఆస్తులు జప్తు చేసినట్లు హోంశాఖ ఉత్తర్వుల్లో తెలిపింది.

లింగమనేని భూములు సేకరణ పరిధిలోకి రాకుండా చేశారని ఆరోపణ:లింగమనేని, హెరిటేజ్‌ సంస్థలతో పాటు, ఇతర నిందితులు, వారి కంపెనీల భూములు సేకరణ పరిధిలోకి రాకుండా ఉండేలా రాజధాని నగర బృహత్‌ ప్రణాళిక ఖరారు చేశారని సీఐడీ ఆరోపించింది. ఆయా సంస్థల భూములకు సమీపం నుంచి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వెళ్లేలా ఎలైన్‌మెంట్‌ సిద్ధం చేశారని పేర్కొంది. తద్వారా లింగమనేని ఆస్తుల విలువ పెరిగి వారికి లబ్ధి కలిగిందని తెలిపింది. దీని వల్ల రైతులకు, ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందని... హోంశాఖ ఉత్తర్వుల్లో వివరించింది. రాజధాని నగర సరిహద్దులు, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్‌ ప్రాంతాల్ని నిర్ణయించే విషయంలో చంద్రబాబు, నారాయణ ఇతర నిందితులతో కలిసి కీలక పాత్ర పోషించారని సీఐడీ ఆరోపించింది. తక్కువ ధరకు భూములు కొని, ఎక్కువకు అమ్ముకునేలా నిందితులకు సహకరించారని అభియోగం మోపింది.

పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి, సీఆర్‌డీఏ ఉపాధ్యక్షుడి హోదాలో నారాయణ తన అధికారిక హోదాను దుర్వినియోగం చేశారని, ఇతర నిందితులతో కుమ్మక్కై రాజధాని అమరావతి నగరంలో స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి చేసే ప్రాంతాన్ని ఎంపిక చేశారని సీఐడీ అభియోగం మోపింది. స్టార్టప్‌ ఏరియా ఎక్కడ వస్తుందో నారాయణకు ముందే తెలిసినందున... దాని పరిసర ప్రాంతాల్లో ఆయన 3 కోట్ల 66 లక్షల రూపాయలతో 58.50 ఎకరాల వ్యవసాయ భూమి కొన్నట్లు సీఐడీ ఆరోపించింది. స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి కోసం సింగపూర్‌ కన్సార్షియం 2015 అక్టోబరులో సీఆర్‌డీఏకి ప్రతిపాదనలు సమర్పించగా, అంతకంటే కొన్ని నెలల ముందే.. 2015 జూన్, జులై, ఆగస్టు నెలల్లో పొత్తూరి ప్రమీల , రాపూరి సాంబశివరావు, ఆవుల మునిశేఖర్‌ పేరిట ఈ భూములు కొన్నారని సీఐడీ చెబుతోంది.

అనంతరం పొత్తూరి ప్రమీల, ఆవుల మునిశేఖర్, రాపూరి సాంబశివరావు ,కె.పునీత్‌ , కె.వరుణ్‌కుమార్‌ కలిసి సంయుక్తంగా ఈ భూములను భూ సమీకరణ పథకం కింద సీఆర్‌డీఏకి ఇచ్చారని, ప్రతిగా సీఆర్‌డీఏ నుంచి రిటర్నబుల్‌ ప్లాట్లు, వార్షిక కౌలు కింద 1.92 కోట్లు పొందారని సీఐడీ పేర్కొంది.మందడం, ఉద్దండరాయునిపాలెం, లింగయపాలెం, రాయపూడి, కొండమరాజుపాలెం గ్రామాల్లో పొత్తూరి ప్రమీల, రాపూరు సాంబశివరావు, ఆవుల మునిశేఖర్, కె.వరుణ్‌కుమార్‌ తదితరుల పేరిట ఉన్న 75,800 గజాల విస్తీర్ణంలోని ప్లాట్లతో పాటు, వారి బ్యాంకుఖాతాల్లోని రూ.1.92 కోట్లు జప్తునకు సీఐడీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది..

రామకృష్ణ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఎండీ కేపీవీ అంజనీకుమార్‌.. నారాయణ విద్యాసంస్థలతో వ్యాపార లావాదేవీల్లో భాగంగా గుల్లపల్లి జగదీష్‌ పేరిట రాయపూడిలో తొలుత 5 ఎకరాల భూమి కొన్నారని సీఐడీ ఆరోపించింది. అందులో మూడెకరాలు 2016లోనే అమ్మేశారని, మిగతా రెండెకరాలు జప్తునకు సీఐడీకి అనుమతిస్తున్నట్లు హోంశాఖ తన ఉత్తర్వుల్లో వివరించింది.

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details