10 min liquor delivery service: ఆన్లైన్ డెలివరీ సంస్థలకు డిమాండ్ బాగా పెరుగుతోంది. ఇప్పటికే ఫుడ్, షాపింగ్ రంగాల్లో ఆన్లైన్ ఆర్డర్స్ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌కు చెందిన ఓ స్టార్టప్ సంస్థ పది నిమిషాల్లో మద్యం డెలివరీ చేసే సేవను ప్రారంభించింది. బూజీ అనే బ్రాండ్‌తో కోల్‌కతా నగరంలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయని ఇన్నోవెంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించింది.
ఇప్పటికే మద్యం డెలివరీ చేసే సంస్థలు ఉన్నాయని.. కానీ పది నిమిషాల్లో చేసే సంస్థ తమదేనని పేర్కొంది. ఎక్సైజ్‌శాఖ అనుమతి పొందిన తర్వాత కోల్‌కతాలోని తూర్పు ప్రాంతంలో ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. మద్యం డెలివరీ చేసేలా బంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని బూజీ సంస్థ సీఈఓ వివేకానంద తెలిపారు. కల్తీ మద్యం, మైనర్లకు డెలివరీ చేయకుండా నిబద్ధతతో పనిచేస్తామని ఆయన చెప్పారు.