Star Campaigners in Telangana Elections :అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు స్టార్ క్యాంపెయినర్లు(Star Campaigners) రాష్ట్రవ్యాప్తంగా జోరుగా పర్యటిస్తున్నారు. ఈసీ అనుమతితో.. సీఎంలు, కేంద్ర మంత్రులు, అగ్రనేతలు, ప్రముఖులను.. తమ ప్రచార తారలుగా పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి. బీఆర్‌ఎస్ నుంచి గులాబీ దళపతి కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, అగ్రనేత హరీశ్‌రావు నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. హెలికాప్టర్‌ను ఉపయోగిస్తూ.. రోజుకు రెండు మూడు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ.. బీఆర్‌ఎస్(BRS)నే రాష్ట్రానికి శ్రీరామరక్ష అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
ఆరు గ్యారెంటీ(Congress Six Guarantees)లతోపాటు.. తెలంగాణ ఇచ్చిన పార్టీకి.. ఒక్క అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్తోంది. చెయ్యి పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున ఖర్గే సహా పొరుగు రాష్ట్ర నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, భట్టివిక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ సహా 40 మంది స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరిస్తూ.. కాంగ్రెస్ గళాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. జాతీయ పార్టీలు ఇంకా ఎక్కువగా స్థానిక నాయకులకు అవకాశాలు ఇవ్వాలని.. అప్పుడే క్షేత్రస్థాయిలో బలోపేతమవుతారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
సీఎంల నుంచి మంత్రుల వరకు - రాజకీయ నేతలకు అడ్డా @ బర్కత్‌పురా గడ్డ