గిరిజన హక్కుల కార్యకర్త, ఎల్గార్ పరిషద్ కేసులో నిందితుడు ఫాదర్ స్టాన్ స్వామి కన్నుమూశారు. ముంబయి బాంద్రాలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ ఇయాన్ డిసౌజా.. బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్‌కు వెల్లడించారు.
"ఆదివారం ఉదయం స్వామికి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచాం. కానీ ఆయన పరిస్థితి మెరుగుపడలేదు. సోమవారం మధ్యాహ్నం ప్రాణాలు కోల్పోయారు."
-కోర్టులో అధికారులు
ఈ వార్తపై న్యాయస్థానం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మరణంపై స్పందించేందుకు మాటలు రావడం లేదని జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ ఎన్జే జమాదార్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్వామి ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపింది.
'తప్పు వారిదే'
అనంతరం మాట్లాడిన స్వామి తరపు న్యాయవాది మిహిర్ దేశాయ్.. ఆయన మరణంపై ఎన్ఐఏను తప్పుబట్టారు. ఈ విషయంలో తలోజా జైలు అధికారులు నిర్లక్ష్యం వహించారని అన్నారు.
"స్వామిని హోలి ఆస్పత్రిలో చేర్పించేందుకు 10 రోజుల ముందు(మే 29న) ఓ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాం. ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయనకు కరోనా పరీక్షలు చేయలేదు. ప్రైవేటులో టెస్టు చేసే సరికి ఆయనకు పాజిటివ్‌గా తేలింది. మరోవైపు.. ఎన్ఐఏ ఒక్కసారి కూడా స్వామి కస్టడీని కోరలేదు. అయినప్పటికీ ఆయన బెయిల్ పిటిషన్‌ను పదేపదే వ్యతిరేకిస్తూ వచ్చింది. స్వామి కస్టడీలో చనిపోయారు కాబట్టి.. ఐరాస మానవహక్కుల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం.. శవపరీక్ష నిర్వహించాలి."
-మిహిర్ దేశాయ్, న్యాయవాది
మహారాష్ట్రలోని బీమా-కోరేగావ్‌లో 2018 జనవరిలో చోటుచేసుకున్న అల్లర్లలో మావోయిస్టుల కుట్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో భాగంగా.. స్వామిని 2020 అక్టోబర్‌లో ఎన్ఐఏ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉంటున్నారు.
ప్రముఖుల దిగ్భ్రాంతి
స్టాన్ స్వామి మృతి పట్ల పార్టీలకతీతంగా నేతలు సంతాపం ప్రకటించారు. సమాజం కోసం జీవితాంతం పోరాడిన ఓ వ్యక్తి కస్టడీలో మరణించడం బాధాకరమని కేరళ సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో న్యాయం అపహాస్యానికి గురి కాకూడదని అన్నారు.
'బాధ్యత కేంద్రానిదే'
స్వామి మరణానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ డిమాండ్ చేశారు. ఆయనకు సరైన వైద్య సేవలు అందించే విషయంలో కేంద్రం విఫలమైందని మండిపడ్డారు. ఆయన మరణం తనను షాక్‌కు గురి చేసిందని చెప్పారు.
'అత్యంత క్రూరం'
ఈ విషయంపై కేంద్రాన్ని తీవ్రంగా తప్పుబట్టారు పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ. స్వామి గౌరవానికి కేంద్రం భంగం కలిగించింది అన్నారు. ఇది అత్యంత క్రూరమైన ఘటన అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆయన మరణంతో కేంద్రం చేతులకు రక్తం అంటుకుందని పేర్కొన్నారు.
'జవాబుదారీగా ఉండాలి'
స్టాన్ స్వామి మరణం తనను కలచివేసిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ తెలిపారు. అణగారిన వర్గాలకు ఆయన అవిశ్రాంత సేవలు చేశారని గుర్తు చేసుకున్నారు. ఎటువంటి అభియోగాలు లేకుండానే.. క్రూరమైన చట్టం కింద కస్టడీలో ఉంచారని మండిపడ్డారు. ఈ హత్యకు జవాబుదారీతనం ఉండాలని ట్వీట్ చేశారు.
స్టాన్ స్వామికి న్యాయం దక్కాల్సిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కేరళ అసెంబ్లీ స్పీకర్ ఎంబీ రాజేశ్, మాజీ సీఎం ఊమెన్ చాందీ, మాజీ విపక్ష నేత రమేశ్ చెన్నితలా సైతం ఆయన మృతి పట్ల విచారం ప్రకటించారు.
ఆదివాసీల కోసం...
తమిళనాడులోని తిరుచిలో జన్మించిన స్టాన్ స్వామి.. వేద శాస్త్రాన్ని అభ్యసించారు. 1970లలో యూనివర్సిటీ ఆఫ్ మనీలా నుంచి సోషియాలజీలో మాస్టర్స్ పట్టా పొందారు. అనంతరం బ్రస్సెల్స్‌లో చదువుకున్నారు. ఝార్ఖండ్‌లో గిరిజనుల హక్కుల కోసం ఆయన మూడు దశాబ్దాల పాటు పోరాడారు. తప్పుడు కేసులతో అరెస్ట్ అయిన గిరిజన యువకుల విడుదల కోసం ప్రయత్నించారు. మావోయిస్టులనే నెపంతో ఆదివాసీలపై నమోదు చేసే తప్పుడు కేసులను తీవ్రంగా వ్యతిరేకించారు.
ఇదీ చదవండి:Viral Video: వేదికపైనే వరుడిని చెప్పుతో కొట్టిన తల్లి