రాజకీయాల్లో మరో వారసుడు ప్రత్యక్ష ఎన్నికల పోరులోకి అడుగుపెడుతున్నారు. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఒకప్పుడు తాత కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన చెపాక్ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక స్టాలిన్ ఎప్పటిలాగే కొలతూరు స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు.
శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే డీఎంకే అభ్యర్థులను స్టాలిన్ శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు 173 మందితో జాబితా విడుదల చేశారు. దురై మురుగన్, కేఎన్ నెహ్రూ, ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం లాంటి సీనియర్ నేతలతో పాటు చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు డీఎంకే మరోసారి అవకాశమిచ్చింది. బొడినాయకనూర్‌లో ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు పోటీగా తంగా తమిళ్‌సెల్వన్‌ను డీఎంకే నిలబెట్టింది. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ.. మార్చి 15న నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తానన్నారు. ప్రతి అభ్యర్థి కరుణానిధి అని భావించి కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఇదే అరంగేట్రం..
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అగ్రనేత కరుణానిధి మనవడు అయిన ఉదయనిధి.. మూడేళ్ల కిందటే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆయన డీఎంకే యూత్ వింగ్ సెక్రటరీగా ఉన్నారు. కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. అయితే అరంగేట్రంలోనే కీలక చెపాక్-ట్రిప్లికకేన్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతుండటం విశేషం. ఈ నియోజకవర్గం డీఎంకేకు కంచుకోటగా ఉంది. గతంలో కరుణానిధి ఈ స్థానం నుంచి మూడు సార్లు పోటీ చేసి విజయం సాధించారు.