తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన డీఎంకే అధినేత స్టాలిన్ పరిపాలనాపరంగా తొలిరోజే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ఉత్తర్వులపై తొలి సంతకం చేశారు.
ఆ ఫైల్‌పై సీఎంగా స్టాలిన్ తొలి సంతకం - స్టాలిన్ నిర్ణయాలు
తమిళనాడులో భారీ మెజారిటీతో అధికారం చేపట్టిన స్టాలిన్.. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పని మొదలుపెట్టారు. ఈ మేరకు కీలక దస్రాలపై సంతకాలు చేశారు. వీటిలో రాష్ట్రంలో పాల ధరల తగ్గింపు, ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సహా.. కరోనా కాలంలో పేదలకు ఆర్థిక సహాయం అందించడానికి సంబంధించిన ఉత్తర్వులు ఉన్నాయి.
స్టాలిన్
ముఖ్యమంత్రిగా స్టాలిన్ 'తొలి' నిర్ణయాలు..
- రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అన్ని బస్సుల్లో మహిళలు అన్ని ఉచితంగా ప్రయాణించవచ్చని స్టాలిన్ ప్రకటించారు. ఇందుకోసం రూ.1,200 కోట్ల రూపాయలను సబ్సిడీగా విడుదల చేసింది ప్రభుత్వం.
- ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్స తీసుకునే వారికి ప్రభుత్వ భీమా పథకం వర్తింపచేయనున్నట్లు ప్రకటించారు స్టాలిన్. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులపై సంతకం చేశారు.
- కరోనాతో అల్లాడుతున్న పేదలకు రూ.4 వేలు ఇస్తామనే పార్టీ హామీ మేరకు.. రేషన్ కార్డుదారులకు తక్షణం రూ.2000 అందించాలని నిర్ణయించారు. దీనితో రాష్ట్రంలోని 2,07,67,000 మంది పేదలకు లబ్ధి చేకూరనుంది. ఈ నిర్ణయంతో ఖజానాపై రూ.4,153.69 కోట్లు భారం పడనుంది.
- డీఎంకే ఇచ్చిన మరో ముఖ్యమైన హామీల్లో ఒకటైన "మీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి" పథకానికి స్టాలిన్ శ్రీకారం చుట్టారు. దీనికింద ఎన్నికల ప్రచారంలో భాగంగా స్వీకరించిన ప్రజా సమస్యల తాలూకు పిటిషన్లను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపు పరిష్కరించనున్నారు. ఈ పథకం అమలు బాధ్యతను ఒక ఐఏఎస్ అధికారికి అప్పగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
- ఎన్నికల్లో డీఎంకే ఇచ్చిన మరో కీలక హామీ.. పాల ధరల తగ్గింపు. ఈ మేరకు ప్రభుత్వ అధీనంలోని డెయిరీ సంస్థ ఏవియన్ పాలపై లీటరుకు రూ.3 తగ్గించే ఉత్తర్వులపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంతకం చేశారు.
ఇదీ చదవండి:తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణం
Last Updated : May 7, 2021, 2:43 PM IST