Stalin On Sanatana Dharma BJP Reaction :సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను అరెస్ట్ చేయాలని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) డిమాండ్ చేసింది. సనాతన ధర్మం సామాజిక న్యాయానికి విరుద్ధమని ఆరోపించిన ఉదయనిధి స్టాలిన్‌ను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి శోభా కరంద్లాజే డిమాండ్ చేశారు. సీఎం స్టాలిన్ కుమారుడు ఇలా మాట్లాడడం బాధగా అనిపించిందన్న ఆమె.. ఉదయనిధిని మంత్రివర్గం నుంచి తప్పించి కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Udhayanidhi Stalin Statement Sanatana Dharma :సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా నేతృత్వంలోని బృందం.. తమిళనాడు భవన్‌లో నిరసన లేఖ సమర్పించింది. స్టాలిన్ వ్యాఖ్యలపై ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ తన వైఖరిని స్పష్టం చేయాలని సచ్‌దేవా డిమాండ్ చేశారు. స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించకపోతే ఆ పార్టీ హిందూ వ్యతిరేకి అనే ప్రజల అభిప్రాయం మరింత దృఢం అవుతుందని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. ఓట్ల కోసం హిందూ మతానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి పని చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. దీని వల్ల ప్రజల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఇండియా ఫ్రంట్ క్షమాపణ చెప్పాలి: రాజ్‌నాథ్
Udhayanidhi Stalin Rajnath Singh :సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు ఈ వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. రాజస్థాన్‌లో బీజేపీ పరివర్తన్ యాత్ర మూడో విడత ప్రారంభం సందర్భంగా జైసల్మేర్‌లో సోమవారం జరిగిన బహిరంగ సభలో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. సనాతన ధర్మాన్ని అవమానించినందుకు ఇండియా ఫ్రంట్ నేతలు క్షమాపణలు చెప్పాలని, లేదంటే దేశం వారిని క్షమించదని రక్షణ మంత్రి అన్నారు.
"వారు(డీఎంకే) సనాతన ధర్మంపై దాడి చేస్తున్నారు. డీఎంకే సనాతన ధర్మంపై దాడి చేసినా కాంగ్రెస్ దానిపై నిశ్శబ్దంగానే ఉంది. ఈ వ్యాఖ్యలపై సీఎం గహ్లోత్ ఎందుకు స్పందించలేదు? సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఖర్గే కూడా దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు? సనాతన ధర్మం గురించి వారు ఏమనుకుంటున్నారో ఎందుకు వెల్లడించడం లేదు? సనాతన ధర్మం వసుధైక కుటుంబం అనే సందేశాన్ని ఇస్తుంది. ప్రపంచం మొత్తాన్ని ఒకే కుటుంబంగా పరిగణిస్తుంది. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌కు తాను చేసిన వ్యాఖ్యలపై స్పష్టత ఉందా? విపక్ష ఇండియా ఫ్రంట్ నేతలు దీనిపై క్షమాపణ చెప్పాలి. లేకపోతే దేశం వారిని క్షమించదు."
-రాజ్‌నాథ్‌సింగ్, రక్షణశాఖ మంత్రి