SrinivasGoud Counter On Botsa Comments : తెలంగాణ విద్యా విధానం, టీఎస్‌పీఎస్సీపై.. ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ క్రమంలోనే బొత్స వ్యాఖ్యల పట్ల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శలు గుప్పించారు. బొత్స సత్యనారాయణ పరీక్షలో చూసి రాసి పాస్ అయ్యారని... అందుకే అలా అనుకుంటున్నారని ఆరోపించారు. తాను తెలంగాణలోనే చదువుకుంటానని.. ఏపీకి చెందిన విద్యార్థి కోర్టుకు కూడా వెళ్లారని శ్రీనివాస్‌గౌడ్ గుర్తు చేశారు.
తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక బొత్స మాట్లాడుతున్నారని శ్రీనివాస్‌గౌడ్ దుయ్యబట్టారు. ఏపీ రాజధాని ఏది అని పరీక్షల్లో అడిగితే.. సమాధానం చెప్పే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. మీ హయాంలో ఏపీపీఎస్సీలో స్కాములు జరిగేవని .. ఇప్పుడు కూడా అలానే అనుకుంటే ఎలా అని బొత్సను ఉద్దేశించి ప్రశ్నించారు. ఈ క్రమంలోనే బదిలీల కోసం మీ హయాంలో సూట్‌కేసులు పట్టుకొని లాడ్జ్‌ల్లో ఉండేవారని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
SrinivasGoud On Botsa : మీ హయాంలో కోళ్ల ఫారాల్లో ఇంజినీరింగ్ కళాశాలలు ఉంటే... నాణ్యత లేదని తాము వాటిని రద్దు చేశామని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఈ క్రమంలోనే తమ దగ్గర వోక్స్ వ్యాగన్ స్కాములు లేవని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు అభివృద్ది చెందాలని ముఖ్యమంత్రి కేసీఆర్.. అమరావతికి వెళ్లి మరీ చెప్పి వచ్చారని గుర్తుచేశారు. మరోవైపు బొత్స పిల్లలు కూడా ఇక్కడే చదివి ఉంటారని శ్రీనివాస్‌గౌడ్పేర్కొన్నారు.
బాధ, ఈర్ష్య, ద్వేషంతో మాట్లాడారా? లేక రాజకీయంగా ఉపయోగపడుతుందని మాట్లాడారా? అని బొత్స సత్యనారాయణను శ్రీనివాస్‌గౌడ్ప్రశ్నించారు. మరోవైపు కరెంట్ లేకపోతే ఇన్ని ఐటీ కంపెనీలు రాష్ట్రానికి వస్తాయా? అని అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఎంతో ఘన చరిత్ర ఉందని.. మీ విశ్వవిద్యాలయాల తరహాలో కాదని తెలిపారు. ఈ క్రమంలోనే టీఎస్‌పీఎస్సీ లీకేజీ కేసులో నిందితులను అరెస్టు చేస్తున్నామని చెప్పారు. ఈ కేసు పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం తీసుకున్న చర్యలను హర్షించాలని శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు.