ఝార్ఖండ్ లాతెహార్ జిల్లాలోని నేతర్‌హాట్ ఎత్తైన ప్రాంతం. ఆ ప్రదేశాన్ని చోటానాగ్‌పుర్ పీఠభూమికి రాణిగా పిలుస్తారు. అది ఆహ్లాదకర వాతావరణం, పచ్చదనంతో పర్యటక ప్రాంతంగా విరాజిల్లుతోంది. అయితే.. సాగు నీటి ఎద్దడి అధికంగా ఉండటం వల్ల రైతులు కొద్దిపాటి భూముల్లో వరి, మొక్కజొన్న, మిర్చి, పసుపు, గుమ్మడి వంటి సంప్రదాయ పంటలను పండిస్తున్నారు. అలాంటి వారికి ఆశాకిరణంగా మారారు శ్రీనివాసన్ రాజు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను వారికి పరిచయం చేసి లాభాల బాట పట్టిస్తున్నారు.
హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాసన్ రాజు.. కొన్నాళ్ల క్రితం తన బృందంతో బాక్సైట్ మైనింగ్ పనుల కోసం నేతర్హాట్కు వెళ్లారు. ఆ సమయంలో సమీప గ్రామాలను సందర్శిస్తూ.. రైతులతో మాట్లాడేవారు. ఇక్కడ ప్రధానంగా మొక్కజొన్న, వరిసాగు చేస్తున్నారని, నీటిఎద్దడి వల్ల మరో రకం పంటపై ఆలోచన చేయలేకపోతున్నారని తెలుసుకున్నారు.
శ్రీనివాసన్ రాజు రైతు కుటుంబానికి చెందిన వారు కావటం వల్ల వ్యవసాయంపై మంచి పట్టు ఉంది. ఈ క్రమంలో నేతర్‌హాట్ భౌగోళిక అంశాలు, వాతావరణానికి అనువైన ప్రత్యామ్నాయ సాగు మార్గాలపై ఆలోచన చేశారు. రైతుల నుంచి 20 ఎకరాల వ్యవసాయ భూమిని లీజుకు తీసుకుని సాగు చేయటం ప్రారంభించారు రాజు. చుట్టుపక్కల రైతులకు ఆధునిక పద్ధతులపై మెలుకువలు నేర్పిస్తూ సాగులో మంచి లాభాలు గడించేలా చేస్తున్నారు.
డ్రిప్ ఇరిగేషన్..
నేతర్హాట్లో సాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న క్రమంలో డ్రిప్ ఇరిగేషన్‌ను ఎంచుకున్నారు శ్రీనివాసన్ రాజు. దీని ద్వారా తక్కువ నీటితోనే ఎక్కువ భూమిలో సాగు చేసేందుకు వీలు కలిగింది. అలాగే దిగుబడి కూడా పెరిగింది. రాజు నుంచి ఈ విషయాలు తెలుసుకున్న కొంత మంది నేతర్‌హాట్ రైతులు కూడా వారి భూముల్లో డ్రిప్ ఇరిగేషన్‌తో సాగు చేయటం ప్రారంభించారు.