హవాలా కేసులో తన ఆస్తులను అటాచ్ చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా వేసిన పిటిషన్‌పై విచారణ జరపలేనంటూ జమ్ముకశ్మీర్ హైకోర్టులోని ఓ న్యాయమూర్తి తప్పుకున్నారు. గతంలోనూ ఈ తరహా పిటిషన్లను విచారించడానికి నిరాకరించినట్లు చెప్పారు.
ఆస్తుల అటాచ్..
తాజా పిటిషన్‌పై కొత్త జడ్జి సమక్షంలో విచారణ జరపడానికి వీలుగా ఈనెల 8కి వాయిదా వేశారు. ఫరూక్ అబ్దుల్లా 2001-11 మధ్య కాలంలో జమ్ముకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తనకు అనుకూలురైన కొందరికి సంఘంలో పదవులిచ్చారని, వారి సాయంతో బీసీసీఐ నిధులను దారి మళ్లించారని ఈడీ నివేదికలో పేర్కొంది. ఆ నిధులతో ఫరూక్ కొన్నట్లు తెలుస్తున్న రూ.12 కోట్ల విలువైన ఆస్తులను గతేడాది డిసెంబరులో అటాచ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది.