జమ్ముకశ్మీర్ శ్రీనగర్ సమీపంలోని పారంపొరాలో గతవారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. వీరి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. ఈ ముగ్గురు అమాయకులని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నట్లు తెలిపారు. ఈ ఎన్కౌంటర్పై నిష్పాక్షిక, పారదర్శక దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ అబ్దుల్లా ట్వీట్ చేశారు.
" ఈ ఎన్కౌంటర్పై వీలైనంత త్వరగా దర్యాప్తు జరపడం చాలా ముఖ్యం. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఇప్పటికే హామీ ఇచ్చినట్లు పారదర్శక విచారణ జరగాలి. అప్పుడే బాధిత కుటంబ సభ్యులకు న్యాయం జరిగినట్లు అవుతుంది. "
-ఒమర్ అబ్దుల్లా ట్వీట్.
పీడీపీ అధినేత్రి, కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కూడా ఇదే డిమాండ్ చేశారు. భద్రతా దళాల ఎన్కౌంటర్లో మరణించిన వారి మృతదేహాలను అప్పగించే విధానాన్ని సమీక్షించాలని, కేంద్రం, జమ్ముకశ్మీర్ పరిపాలనా విభాగాన్ని కోరారు.