Srinagar attack: జమ్ముకశ్మీర్ శ్రీనగర్‌లోని పోలీసు బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ఘటనలో మరో పోలీసు మరణించారు. తీవ్ర గాయలతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఫలితంగా ఈ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య మూడుకు చేరింది. మిగిలిన 11 మంది ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సీయనిర్ పోలీసు అధికారులు తెలిపారు.
కంగన్‌కు చెందిన కానిస్టేబుల్ రజీమ్ అహ్మద్ మంగళవారం ఉదయం ప్రాణాలు కోల్పోగా.. ఘటనా స్థలంలోనే సబ్ఇన్స్పెక్టర్, సీనియర్ గ్రేడ్ కానిస్టేబుల్ అమరులయ్యారు.
శ్రీనగర్ శివారులోని జెవాన్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం 5:50 గం. సమయంలో పోలీసు బస్సుపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఏఆర్ పోలీసు తొమ్మిదో బెటాలియన్.. శ్రీనగర్‌లో తమ విధులు ముగించుకుని పంతా చౌక్ మీదుగా జెవాన్లోని ఆర్మ్డ్ పోలీసు కాంప్లెక్స్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
దీని గురించి మాట్లాడిన కశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్.. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన కశ్మీర్ టైగర్స్ ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం ఉందని చెప్పారు. బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఓ ముష్కరుడు గాయపడినట్లు తెలిపారు. దాడికి పాల్పడినవారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు.
ఇదీ చూడండి:పోలీస్ బస్‌పై ఉగ్రవాదుల దాడి- ఇద్దరు మృతి