Sri lanka president election 2022: తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో కొత్త నాయకత్వం కొలువుదీరబోతోంది. దేశ నూతన అధ్యక్షుడు, ప్రధానమంత్రిని బుధవారం ఎన్నుకోనున్నారు. అధ్యక్ష పదవి రేసులో ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె కంటే అధికార పార్టీ శ్రీలంక పొదుజన పెరమున (ఎస్‌ఎల్‌పీపీ) బలపరిచిన దులస్ అలహాప్పెరుమా ముందున్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడిగా అలహాప్పెరుమాను, ప్రధానమంత్రిగా ప్రతిపక్ష నాయకుడు సాజిత్ ప్రేమదాసను ఎన్నుకోవాలని ఎస్‌ఎల్‌పీపీ మెజార్టీ సభ్యులు నిశ్చయించినట్లు పార్టీ అధ్యక్షుడు జీఎల్ పైరిస్ మంగళవారం ప్రకటించారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమాగి జన బలవేగాయ (ఎస్‌జేబీ) నాయకుడు సాజిత్ తొలుత అధ్యక్ష పదవికి పోటీచేయాలనుకున్నా.. చివరకు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని అలహాప్పెరుమాకు మద్దతు ప్రకటించారు. ఆయన ప్రధానిగా ఎన్నికవడం దాదాపుగా లాంఛనప్రాయమేనని సమాచారం.
దేశాన్ని దివాలా తీయించిన మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ప్రజాగ్రహానికి భయపడి విదేశాలకు పారిపోవడం వల్ల కొత్త అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది. వాస్తవానికి గొటబాయ 2024 నవంబరు వరకు పదవిలో ఉండాల్సింది. కాబట్టి ఆయన స్థానంలో కొత్తగా ఎన్నికయ్యే అధ్యక్షుడు ఆ గడువు వరకు పదవిలో కొనసాగుతారు. లంక పార్లమెంటు తమ దేశాధ్యక్షుడిని నేరుగా ఎన్నుకోనుండటం గత 44 ఏళ్లలో ఇదే తొలిసారి. పార్లమెంటులో మొత్తం 225 మంది సభ్యులున్నారు. ఇందులో ఎస్‌ఎల్‌పీపీ బలం 101గా, ఎస్‌జేబీ బలం 50గా ఉంది. వామపక్ష పార్టీ జనతా విముక్తి పెరమున నాయకుడు అనూర కుమార దిశనాయకే కూడా అధ్యక్ష పదవికి పోటీపడుతున్నా ఆయన గెలిచే అవకాశాలు దాదాపుగా లేవు.