విపక్ష నాయకుల చెంపలు వాయించడం.. అట్టడుగు వర్గాలైతే ఈడ్చి తన్నడం.. ఇదే 'ఆమె' తీరు Srikalahasti CI Anju Yadav Behavior: ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలనైతే అందరి ముందు రెండు చెంపలు వాయిస్తారు.. అట్టడుగు వర్గాలైతే ఈడ్చి ఈడ్చి తంతారు.. అధికార పార్టీ నేతలపై మాత్రం ఈగ కూడా వాలనివ్వరు.. ప్రతిపక్షాలు ఆందోళనకు దిగినా, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించినా.. అధికార పార్టీ శ్రేణుల కంటే ఆమే ఎక్కువగా బాధపడతారు. ఆందోళన చేస్తున్న నేతలపై నోరు పారేసుకుంటారు. వెనకాముందూ చూడకుండా చేయి చేసుకుంటారు. తాజాగా బుధవారం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలను నిరసిస్తూ సీఎం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించిన శ్రీకాళహస్తి జనసేన శ్రేణులను అడ్డుకోవడమే కాక ఆ పార్టీ నేత సాయి.. రెండు చెంపలను ఇష్టానుసారంగా వాయించి ఆ అధికారి మరోమారు వార్తల్లోకి ఎక్కారు.
శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ మరోసారి విపక్ష నేతలపై రెచ్చిపోయారు. విపక్ష నేతలను చూస్తేనే విరుచుకుపడే ఆమె.. జనసేన నేతలపై ప్రతాపం చూపారు. ఆందోళన చేస్తున్న ఆపార్టీ నేత చెంపలు చెళ్లుమనిపించడం వివాదానికి దారితీసింది. పవన్‌కల్యాణ్‌పై అధికారపార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను నిరసిస్తూ జనసేన నేతలు శ్రీకాళహస్తిలో నిరసన చేపట్టారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించగా.. అక్కడే ఉన్న సీఐ అంజూయాదవ్ వారిని చూసి ఒక్కసారిగా రగిలిపోయారు. జనసేన నేత కొట్టే సాయిపై చేయి చేసుకున్నారు. రెండు చెంపలను వాయించారు. విపక్ష నేతల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న సీఐపై చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు.
కోపం వచ్చిందంటే చాలు: వివాదాలు అంజూయాదవ్‌కు కొత్తేమి కాదు. గతంలోనూ ఆమె ఇలాంటి చర్యలతో ఎన్నోసార్లు విమర్శలపాలయ్యారు. ప్రతిపక్షాలను చూస్తే చాలు ఆమె పూనకంతో ఊగిపోతారు. వైఎస్సార్సీపీ నేతలు తమవారిపై దాడులు చేస్తున్నారంటూ గతంలో టీడీపీ నేతలు సుధీర్‌రెడ్డి పోలీసుస్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. వైఎస్సార్సీపీ నేతలపై కేసులు నమోదు చేయకపోగా.. ఆందోళనకు అనుమతి లేదంటూ బాధితులపైనే సీఐ కేసులు పెట్టడం గమనార్హం. మరోసారి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ధర్నా చేస్తున్న టీడీపీ కార్యకర్తపైనా చేయిచేసుకున్నారు. ఆమెకు కోపం వచ్చిందంటే తనామనా అన్న భేదం లేదు.. పోలీసులపైనా తిట్లదండకం అందుకుంటారు.
సామాన్యులపై కూడా ప్రతాపం: సామాన్యులపైనా సీఐ అంజూయాదవ్ ప్రతాపం చూపుతారు. అడిగినంత డబ్బు ఇవ్వలేదని గత సంవత్సరం సెప్టెంబర్‌లో శ్రీకాళహస్తి శివారులో ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద వీరంగం సృష్టించారు. తోటి మహిళ అనే కనికరం లేకుండా వివస్త్రను చేసి నడిరోడ్డుపై హోటల్ యజమాని భార్యను విచక్షణరహితంగా చితకబాదారు. చేయని తప్పు అంగీకరించాలంటూ చావబాదారు. ఒప్పుకోకపోతే గంజాయి కేసుపెట్టి మూడు నెలలు బయటకు రాకుండా చేస్తానంటూ గొంతుపై బూటుకాలితో నులిమారని బాధిత మహిళ వాపోయారు. అవమానభారంతో ఇంటి నుంచి బయటకు కూడా రాలేకపోతున్నానన్నారు. మహిళపై దాడి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణకు ఆదేశించి 9నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు.