Para Badminton Player Rupa Devi: ఆశయం బలంగా ఉంటే చిగురించే ఆశలే అస్త్రాలవుతాయి. ఈ యువతి విషయంలో కూడా సరిగ్గా అదే జరిగింది. అనుకోకుండా ప్రమాదానికి గురై కాళ్లలో చలనం కోల్పోయినా... తలరాతకు తలొంచకుండా తట్టుకుని నిలబడింది. నేడు మన ముందుకొచ్చింది. చిన్న పల్లెటూరు నుంచి క్రమంగా ఎదుగుతూ పారా బ‌్యాడ్మింటన్‌లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది.
ఈ యువతి పేరు పడాల రూపాదేవి. శ్రీకాకుళం జిల్లా సంతవురిటి గ్రామవాసి. నాన్న చిన్నతనంలోనే మరణించారు. ఓ సోదరి. ఇద్దరు ఆడపిల్లల పెంపకం కష్టమవడంతో చిన్నప్పటి నుంచి నానమ్మ, తాతయ్యల వద్ద పెరిగిందీ అమ్మాయి. అయినా చదువులో చురుగ్గా ఉండేది. పదో తరగతి, ఇంటర్మీడియట్‌లోనూ ఫస్టే. డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తైన తర్వాత విజయవాడ లో ప్రమాదవశాత్తూ రెండంతస్తుల భవనం నుండి పడిపోయింది. దాంతో వెన్నెముక దెబ్బతిని నడవలేని స్థితికి చేరింది.
ఆ సమయంలో అందరూ జాలిగా చూడడం నచ్చేది కాదంటుంది రూప. అందుకోసం తనను తాను మళ్లీ నిరూపించుకోవాలని వైద్యుల సహాయంతో వ్యక్తిగత పనులు తాను చేసుకునేలా శిక్షణ పొందింది. స్వంతంగా పనులు చేసుకునే స్థాయికి చేరాక ఉద్యోగం కోసం బెంగుళూరులో ఓ శిక్షణ శిబిరానికి వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చే సమయంలో అనుకోకుండా పారా బ్యాడ్మింటన్ గురించి తెలుసుకున్నానంటుంది రూపాదేవి.
"నేను ఎప్పుడైతే అక్కడ ట్రైనింగ్ తీసుకుని ఇండిపెండెంట్ అయ్యానో.. అప్పుడే అనుకున్నాను. ఇండిపెండెంట్ అయిన తర్వాత కూడా నేను ఎందుకు ఇంట్లోనే ఉండాలి. ఏదో ఒక జాబ్ చేద్దామనుకుని బెంగుళూరు వెళ్లాను. మూడు నెలలు జాబ్ ట్రైనింగ్ తీసుకుని ఇంటిక వస్తున్న సమయంలో వీల్ చైర్ పారా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరుగుతుందని ఫ్రెండ్స్ చెప్పారు. అసలు ఆ గేమ్ ఏంటి, దానిని ఎలా ఆడాలో యూట్యూబ్‌లో చూసి తెలుసుకున్నాను. ఆ తర్వాత ఆ టోర్నమెంట్‌కు వెళ్లి ఆడి ఫస్ట్ సారి సిల్వర్ మెడల్ గెలుచుకున్నాను. అప్పడు మా కోచ్ నన్ను ప్రోత్సహించి కోచింగ్ ఇస్తున్నారు. నేను ప్రస్తుతం మైసూర్లో కోచింగ్ తీసుకుంటున్నాను. మార్చి 23 నుంచి 26 వరకు ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన జాతీయ స్థాయిలో టోర్నమెంట్లో సింగిల్స్‌లో గోల్డ్ మెడల్, డబుల్స్‌లో సిల్వర్ మెడల్ వచ్చింది"-రూపాదేవి, పారా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి