మధ్యప్రదేశ్‌లో శ్రీ రామనవమి వేడుకల్లో అపశ్రుతి జరిగి 35 మంది మరణించారు. ఇందౌర్‌లోని మహదేవ్ జులేలాల్ ఆలయంలో మెట్ల బావి పైకప్పు కూలి అందులో భక్తులు పడిపోయారు. ఈ ఘటనలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. 18 మంది గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పోలీసుల సమచారం ప్రకారం..పటేల్ నగర్ ప్రాంతంలో ఉన్నమహదేవ్ జులేలాల్ ఆలయంలో రామనవమి ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి రద్దీ పెరగడం వల్ల ఈ ఘటన జరిగింది. స్థలాభావం కారణంగా వేడుకలను చూసేందుకు కొందరు భక్తులు.. ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్ల బావిపై కూర్చున్నారు.
రామనవమి వేడుకల్లో అపశ్రుతి.. 50 అడుగుల బావిలో పడ్డ భక్తులు దురదృష్టవశాత్తూ ఆ బావి పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో దాదాపు 50 మంది భక్తులు బావిలో పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నిచ్చెన, తాళ్ల సాయంతో కొందరు భక్తులను కాపాడి ఆసుపత్రికి తరలించారు. బావి లోతు 50 అడుగులపైనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదం జరిగిన చాలాసేపటి వరకు రెస్క్యూ సిబ్బంది, అంబులెన్స్ చేరుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.
మోదీ దిగ్భ్రాంతి..
ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు ఫోన్ చేసిన పరిస్థితి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నట్లు ట్వీట్ చేశారు. అటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ కూడా ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని, సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు సీఎం.. రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి పరిహారంగా రూ.50 వేలు అందిస్తామని చెప్పారు.
ప్రమాదం జరిగిన ఇందౌర్ మహదేవ్ జులేలాల్ ఆలయం చాలా పురాతనమైనది. ఇక్కడ ఏటా రామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. చుట్టుపక్క ప్రాంతాలకు చెందిన భక్తులు.. ఈ వేడుకలను చూసేందుకు తరలివస్తారు. కానీ ఈ సంవత్సరం ఇలాంటి విషాద ఘటన జరగడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆటోను ఢీకొట్టిన ట్రక్కు.. ఐదుగురు మృతి
మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముద్ఖేడ్ ప్రాంతంలో ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో గురువారం ఉదయం పది గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. నాందేడ్ నుంచి వస్తున్న ట్రక్కు.. ఎదురుగా వస్తున్న ఆటోని ఢీకొట్టింది.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్షల నిమిత్తం.. స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన ప్రయాణికులను ముద్ఖేడ్ ఆస్పత్రిలో చేర్పించారు. మృతులను బుల్దానా జిల్లాలోని మెహకర్‌కు చెందిన సరోజా రమేశ్ భోయ్, కల్యాణ్ భోయ్, జోయల్ భోయ్, పుండలిక్, కిషన్ రావ్‌గా పోలీసులు గుర్తించారు.
ఘోర ప్రమాదం.. ఆరుగురు కూలీలు మృతి..
గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పశువుల మేత తీసుకొని వెళ్తున్న ఓ మినీ ట్రక్కు టైరు పంక్చర్ అయింది. దీంతో అది అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యవసాయ కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు సమాచారం. దీనిపై సమాచారం అందుకుమన్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు పోలీసులు.