తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వచ్చేవారం శ్రీలంక కొత్త అధ్యక్షుడి ఎన్నిక... బరిలో విపక్ష నేత ప్రేమదాస

శ్రీలంకలో నూతన ప్రభుత్వ ఏర్పాటు దిశగా అఖిలపక్షాలు అడుగులు వేస్తున్నాయి. ఈ నెల 15న శ్రీలంక పార్లమెంటు ప్రత్యేక సమావేశం కానుంది. ఈ నెల 20న రాజపక్స స్థానంలో శ్రీలంక కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్లు స్పీకర్‌ మహీంద యాపా అబేవర్ధన ప్రకటించారు.

వచ్చేవారంలో శ్రీలంక కొత్త అధ్యక్షుడి ఎన్నిక
వచ్చేవారంలో శ్రీలంక కొత్త అధ్యక్షుడి ఎన్నిక

By

Published : Jul 12, 2022, 5:28 AM IST

Updated : Jul 12, 2022, 10:51 AM IST

అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ప్రధాని రణిల్‌ విక్రమసింఘె తమ పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో.. దేశంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరదించేందుకు శ్రీలంకలోని వివిధ రాజకీయ పార్టీలు గత రెండు రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు సోమవారం ఒక కొలిక్కి వచ్చాయి. వచ్చే వారం పార్లమెంటులో నూతన అధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్లు స్పీకర్‌ మహీంద యాపా అబేవర్ధన ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అంతకు ముందు జరిగిన అఖిలపక్ష సమావేశంలో వివిధ పార్టీ నేతలు కలిసి తీసుకున్నారు. బుధవారం (జూన్‌ 13న) గొటబాయ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన ప్రధాని రణిల్‌ విక్రమసింఘెకు కూడా అధికారికంగా తెలిపారు. శనివారం అధ్యక్ష భవనంపై దాడి అనంతరం గొటబాయ అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. రాజపక్స రాజీనామా సమర్పించగానే, అధ్యక్ష ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. 15న పార్లమెంటు సమావేశమై.. అధ్యక్ష పదవి ఖాళీని అధికారికంగా ప్రకటిస్తుంది. 19న నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 20న పార్లమెంటులో నూతన అధ్యక్షుడిని ఎన్నిక జరుగుతుంది.

ఈ నేపథ్యంలో.. అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు ప్రతిపక్ష నేత సజిత్‌ ప్రేమదాస ప్రకటించారు. ఆంగ్ల పత్రిక బీబీసీతో మాట్లాడుతూ గొటబాయ రాజపక్స అధికారం నుంచి దిగిన వెంటనే అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తానని పేర్కొన్నారు. ఆయన పార్టీ సమగి జన బలవెగయ (ఎస్‌జేబీ) ఇప్పటికే ఇతర పక్షాలతో ఈ అంశంపై చర్చలు జరిపింది. సజిత్‌ మాట్లాడుతూ .. "ఒక వేళ ఖాళీ ఏర్పడితే నేను నామినేషన్‌ వేసేందుకు సిద్ధం. ఇప్పటికే ఈ అంశంపై పార్టీలో, మిత్రపక్షాలతో చర్చించాం. మేము ప్రజలను మోసం చేయడానికి గద్దెనెక్కం. శ్రీలంకను ఈ సంక్షోభం నుంచి బయటపడేయటానికి అనుకున్న ప్రణాళికను ముక్కుసూటిగా అమలు చేస్తాం" అని వెల్లడించారు.

ఆయన 2019లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా అధ్యక్ష పీఠం ఎక్కాలంటే అధికార పార్టీ ఎంపీల మద్దతు కూడా అవసరం. ఇప్పటికే రాజపక్స కుటుంబంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటం సజిత్‌కు కలిసి వచ్చే అంశం. ఈ నేపథ్యంలో అన్నిపక్షాలతో కలిసి ఏర్పాటు చేయనున్న తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించేందుకు అంగీకరించారు. ఇప్పటికే శ్రీలంక ద్రవ్యోల్బణం జూన్‌ నాటికి 55శాతానికి చేరింది.

శ్రీలంక రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్షుడు, ప్రధాని రాజీనామా చేస్తే.. గరిష్ఠంగా 30 రోజుల వరకు తాత్కాలిక అధ్యక్షుడిగా స్పీకర్‌ కొనసాగవచ్చు. ఆలోపు పార్లమెంటు.. తమ సభ్యుల్లో ఒకరిని అధ్యక్షుడిగా ఎన్నుకోవాలి. గొటబాయ పదవీ కాలం మరో రెండేళ్లు మాత్రమే ఉంది. కాబట్టి కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు కూడా ఆ రెండేళ్లే.. పదవిలో కొనసాగుతారు. నూతనంగా ఏర్పడే అఖిలపక్ష ప్రభుత్వానికి నేతృత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు శ్రీలంక ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమగి జన బలవేగయ ప్రకటించింది. ప్రస్తుత మంత్రిమండలి కూడా.. తాత్కాలిక అఖిలపక్ష ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకారం కుదిరిన వెంటనే తమ పదవులకు రాజీనామా చేస్తామని పేర్కొంది. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధికారాలకు స్పీకర్‌ కార్యాలయం కత్తెర వేసింది. అజ్ఞాతం నుంచే ఆయన ఆదివారం నేరుగా అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో ఇక నుంచి అధ్యక్ష ఉత్తర్వులు స్పీకర్‌ కార్యాలయం నుంచే విడుదలవుతాయని అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది.

ఇవీ చూడండి

Last Updated : Jul 12, 2022, 10:51 AM IST

ABOUT THE AUTHOR

...view details