Sri lanka President In India Visit 2023 : మిత్రదేశం శ్రీలంకతో ఎప్పటిలాగానే సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శ్రీలంక ప్రభుత్వం అక్కడి తమిళుల ఆకాంక్షలు నెరవేరుస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత పర్యటనలో ఉన్న శ్రీలంక అధ్యక్షుడు.. ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపి పలు ఒప్పందాలు చేసుకున్నారు. ఇరు దేశాల మధ్య దీర్ఘకాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ఇరువురు నేతలు చర్చించారు. గత ఏడాది.. శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న తర్వాత ఆ దేశ అధ్యక్షుడు తొలిసారి భారత్ వచ్చారు. శ్రీలంకలో సంక్షోభం నెలకొన్న సమయంలో భారత్ అండగా నిలిచింది. దాదాపు 4 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక తోడ్పాటుతోపాటు ఔషధ సామగ్రి వంటి రూపాల్లో సాయం అందించిన భారత్‌కుఈ సందర్భంగా విక్రమసింఘె ధన్యవాదాలు తెలిపారు.
"భారత్-శ్రీలంక మధ్య విమానయాన కనెక్టివిటీని పెంపొందించడానికి ఇరుదేశాల మధ్య అంగీకారం కుదిరింది. ప్రజల వాణిజ్యం, ప్రయాణాలను పెంపొందించడానికి తమిళనాడులోని నాగపట్నం-శ్రీలంకలోని కంకేసంతురై మధ్య ప్యాసింజర్ ఫెర్రీ సేవలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాం. శ్రీలంకలో యూపీఐని ప్రారంభించేందుకు సంతకం చేసిన ఒప్పందం.. ఫిన్‌టెక్ కనెక్టివిటీని పెంచుతుంది."