గోమాతల సంరక్షణ కోసం దేశవ్యాప్తంగా ప్రచారాలు హోరెత్తుతున్నాయి. పశువులను కాపాడుకోవాలన్న స్పృహ ప్రజల్లోనూ క్రమంగా పెరుగుతోంది. చురూలోని శ్రీబాలాజీ గోశాల ఇన్‌స్టిట్యూట్ అనే ఓ సంస్థ.. ఆ దిశగానే కృషి చేస్తోంది. ఇక్కడ పశువులను కన్నబిడ్డల్లాగా శ్రద్ధగా సాకుతారు. ఈ గోశాల ప్రత్యేకత ఏంటంటే.. పశువులకు ఆర్ఓ నీటిని, ఇజ్రాయెల్ సాంకేతికతతో సేంద్రియ పద్ధతుల్లో పెంచిన గడ్డినీ అందిస్తారు. అంతేకాదు.. పశువులు పెద్ద సంఖ్యలో ఉన్నందున గంటకు 1000 రొట్టెలు చేసే ఆధునిక యంత్రాలు గోశాలలో ఏర్పాటు చేశారు.
"ఇజ్రాయెల్ సాంకేతికతతో పనిచేసే ఓ యంత్రం ఇక్కడ ఏర్పాటు చేశాం. ఆ యంత్రంలో 24 గంటలూ సేంద్రీయ గడ్డి అందుబాటులో ఉంటుంది. శీతాకాలమైనా, వేసవికాలమైనా.. ఏ ఉష్ణోగ్రత వద్దనైనా.. 50డిగ్రీల వేడిలోనూ గడ్డి ఎప్పటికీ తాజాగానే ఉంటుంది."
-రవిశంకర్ పూజారి, శ్రీబాలాజీ గోశాల ఇన్‌స్టిట్యూట్ అధ్యక్షుడు
ప్రస్తుతం ఈ గోశాలలో 1600 పశువులు ఆశ్రయం పొందుతున్నాయి. వాటిలో ఎక్కువ శాతం ప్రత్యేక అవసరాలున్నవి లేదా యజమానులెవరూ లేని అభాగ్య పశువులే. ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షించేందుకు గోశాల వ్యాప్తంగా 37 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు.
"బ్రెడ్ మేకింగ్ మెషీన్‌లో గంటకు 1000 రొట్టెలు తయారవుతాయి. గోశాలలోని గోవులన్నింటికీ రోజుకు ఒక క్వింటాల్ గోధుమపిండితో తయారుచేసిన రొట్టెలు తినిపిస్తాం."
-రవిశంకర్ పూజారి
గోశాలలోని పశువుల పేడ నుంచి తయారు చేసే పిడకలను.. దహన సంస్కారాల్లో వినియోగిస్తామని చెప్తున్నారు నిర్వాహకులు.