రష్యా అభివృద్ధి చేసిన కరోనా టీకా స్పుత్నిక్-వి మరో పది రోజుల్లో భారత్‌లోకి రానుంది. వచ్చే నెలలో భారత్‌లో స్పుత్నిక్-వి టీకా ఉత్పత్తిని ప్రారంభించి.. ప్రతి నెలా 50 మిలియన్ల డోసులు ఉత్పత్తి చేయనున్నట్లు రష్యాలో భారత రాయబారి బాల వెంకటేశ్ వర్మ వెల్లడించారు. ఈ నెల చివరిలోపు రష్యా నుంచి స్పుత్నిక్-వి డోసుల మొదటి దిగుమతి జరుగుతుందని.. మే నెలలో భారత్‌లో ఉత్పత్తి ప్రారంభించి క్రమంగా పెంచనున్నట్లు ఆయన వెల్లడించారు.
రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిన్-వి టీకా అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) కొద్ది రోజుల క్రితమే అనుమతించింది. డీసీజీఐ అనుమతితో వ్యాక్సిన్ దిగుమతికి మార్గం సుగుమమైనట్లు భారత్‌లో స్పుత్నిక్ టీకా క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోన్న డాక్టర్ రెడ్డీస్ సంస్థ వెల్లడించింది.