కర్ణాటక హసన్ జిల్లాలో దారుణం జరిగింది. తన ప్రేమను తిరస్కరించిందని యువతిని కారుతో ఢీకొట్టి చంపాడు ఓ యువకుడు . అనంతరం ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. నిందితుడు భరత్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బాధితురాలు శరణ్య ఆగస్ట్ 3న ఆఫీసుకు నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి భరత్ అనే వ్యక్తి కారుతో ఢీకొట్టాడు. అనంతరం కారును అదుపు చేయలేక ఆటో, బస్సు, రెండు బైక్‌లను సైతం ఢీకొట్టాడు. ఈ ఘటనలో శరణ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ఆగస్టు 4న మరణించింది. శరణ్య.. హెంజగొండనహళ్లి గ్రామానికి చెందిన అమ్మాయి. ఆమె బువనహళ్లిలోని భారతి అసోసియేట్స్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తోంది. నిందితుడు భరత్.. బొమ్మనాయికనహళ్లికి చెందిన యువకుడు.
నిందితుడు భరత్ కారును ఘటనా స్థలంలోనే వదిలి పారిపోయాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది రోడ్డు ప్రమాదమా, కావాలనే యాక్సిడెంట్ ఎవరైనా చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. ఆగస్టు 12న పోలీసులు భరత్‌ను పట్టుకున్నారు. పోలీసుల విచారణలో.. ఉద్దేశపూర్వకంగానే శరణ్యను కారుతో వెనుక నుంచి ఢీకొట్టినట్లు భరత్ అంగీకరించాడు. "పదే పదే నిందితుడు భరత్.. శరణ్యను ప్రేమ పేరుతో వేధించేవాడు. అతడి ప్రేమను ఆమె ఒప్పుకోకపోవడం వల్ల ఈ దారుణానికి పాల్పడ్డాడు" అని పోలీసులు తెలిపారు. భరత్ మైసూరు నుంచి కారును అద్దెకు తెచ్చాడని చెప్పారు.