Spurious liquor Bihar: బిహార్‌లో మరోమారు కల్తీ మద్యం కలకలం సృష్టించింది. లిక్కర్ బ్యాన్ నేపథ్యంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా కల్తీ మద్యం విక్రయాలు ఆగటం లేదు. ఆ మద్యం సేవించి అమాయకులు బలవుతున్నారు. బిహార్‌లోని భాగల్పుర్, బాంకా, మధేపురా జిల్లాల్లో తాజాగా మరో 19 మంది అనుమానస్పద రీతిలో మృతి చెందారు. కల్తీ మద్యం కారణంగానే ప్రాణాలు కోల్పోయారని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
భాగల్పుర్, బంకా జిల్లాల్లో..
భాగల్పుర్ జిల్లాలోని యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు అనుమానాస్పదంగా మృతి చెందారు. దీనికి కల్తీ మద్యమే కారణమని స్థానికులు ఆరోపించారు. పోస్ట్‌మార్టం తర్వాత అసలు కారణం తెలుస్తుందని పోలీసులు స్పష్టం చేశారు. కల్తీ మద్యం తయారీపై దాడులు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని నారాయణ్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో మరో నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా భాగల్పుర్ జిల్లాలో 8 మంది మృతి చెందారు.
బాంకా జిల్లాలో గత నాలుగైదు రోజుల్లో ఎనిమిది మంది మరణించారు. అయితే, కల్తీ మద్యం మరణాలుగా జిల్లా యంత్రాంగం ఎలాంటి ప్రకటన చేయలేదు.