బంగాల్, అసోంలో అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసింది. పశ్చిమ్ బంగాలో 30 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా.. పలు చోట్ల చెదురుమదురు ఘటనలు జరిగాయి. తీవ్ర ఉద్రిక్తతల నడుమ కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
సాయంత్రం ఆరు గంటల వరకు.. బంగాల్లో 80.43 శాతం ఓటింగ్ నమోదైనట్లు భారత ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఓటర్లకు మాస్కులు ఇస్తున్న సిబ్బంది అసోంలోనూ రెండో దశ పోలింగ్ సజావుగా సాగింది. ఆ రాష్ట్రంలో 39 స్థానాలకు ఓటింగ్ జరిగింది. సాయంత్రం ఆరు గంటల నాటికి అసోంలో 73.03 శాతం పోలింగ్ రికార్డైనట్లు ఈసీ తెలిపింది.
ఓటర్లకు థర్మల్ స్క్రీనింగ్ బంగాల్లో ఘర్షణలు..
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, భాజపా అభ్యర్థి సువేందు అధికారి తలపడుతున్న నందిగ్రామ్‌కు ఈ దశలోనే పోలింగ్ నిర్వహించిన నేపథ్యంలో.. అందరి దృష్టి ఈ ఎన్నికపై నెలకొంది.
ఓటేసేందుకు బారులుదీరిన ప్రజలు ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులుదీరారు.
సువేందు అధికారి.. ఉదయమే ఓటువేశారు. ఏడున్నర ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన వరుసలో వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీదీ ఓటమి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కట్టుదిట్టమైన ఏర్పాట్లు..
కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులతో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది ఈసీ. 650 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించింది. అయినప్పటికీ పలు ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు, ఘర్షణలు, అల్లర్లు చెలరేగాయి.
పోలింగ్ ప్రారంభానికి ముందే పశ్చిమ్ మెదినీపుర్లోని ఓ టీఎంసీ కార్యకర్తను దుండగులు పొడిచిచంపారు. దీనికి భాజపానే కారణమని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
చనిపోయిన టీఎంసీ కార్యకర్త పరస్పరం ఫిర్యాదు..
కొన్ని పోలింగ్ కేంద్రాల్లోకి తమ ఎన్నికల ఏజెంట్లను అనుమతించలేదని టీఎంసీ నేతలు ఆరోపించారు. నందిగ్రామ్‌లోని పలు కేంద్రాల్లో తమ ఏజెంట్లను.. భాజపా భయపెడుతోందని, ఓటర్లనూ అడ్డుకుంటున్నారని తెలిపారు. దీంతో రోజంతా నందిగ్రామ్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్న మమత.. అక్కడి బోయల్ ప్రాంతంలోని 7వ నెంబరు పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటింగ్ సరళిని పరిశీలించారు.
ఇదీ చదవండి:నందిగ్రామ్ రణం: రోజంతా వార్ రూమ్‌లోనే దీదీ!
మమత అక్కడికి చేరగానే.. భాజపా మద్దతుదారులు జైశ్రీరాం నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. అక్కడి 7వ నెంబర్ బూత్‌లో రీపోలింగ్ జరపాలని టీఎంసీ డిమాండ్ చేసింది.
ఈ సమయంలోనే ఈసీపై విరుచుకుపడ్డారు మమతా బెనర్జీ. 63 ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోలేదని, దీనిపై కోర్టుకు వెళ్తానని హెచ్చరించారు. అనంతరం.. పోలింగ్ కేంద్రం నుంచే గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. 'ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన గూండాలు ఓటర్లను అడ్డుకుంటారని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని' ఆయనకు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: ఫిర్యాదుల్ని పట్టించుకోరేం.. కోర్టుకెళ్తాం: మమత
'నందిగ్రామ్' సమరంలో విజేత ఎవరు?
ఖండించిన భాజపా..
అయితే ఈ ఆరోపణలను తోసిపుచ్చిన భాజపా.. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా పోలీసులు చూడట్లేదని ఆరోపించింది. పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలకు పాల్పడే విధంగా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలను అనుమతిస్తున్నారని ఫిర్యాదు చేసింది.
- ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని.. బంగాల్ భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్ బదులిచ్చారు.
- నందిగ్రామ్ ఓటర్లను అవమానించడం.. మమతకు అలవాటుగా మారిందని విమర్శించారు సువేందు.
- నందిగ్రామ్ బ్లాక్-1లో కొందరు ఓటర్లు.. రోడ్డుపై బైఠాయించారు. కేంద్ర బలగాలు.. తమను ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకున్నాయని ఆరోపించారు.
- మరోవైపు.. పోలింగ్ కేంద్రాలకు వెళ్లిన సమయంలో సువేందు అధికారి కారుపై కొందరు రాళ్లు రువ్వారు. నందిగ్రామ్‌లోని రెండు వేర్వేరు చోట్ల రాళ్లు రువ్విన ఘటనలు జరిగాయి.
డేబ్రా నియోజకవర్గం భాజపా మండల అధ్యక్షుడు మోహన్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేబ్రా భాజపా అభ్యర్థి భారతీ ఘోష్.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని తృణమూల్ ఆరోపించింది.
ఇక్కడ ఓ భాజపా నేత కారును దుండగులు ధ్వంసం చేశారు.
అసోంలో ప్రశాంతం..
అసోంలో కొన్ని చోట్ల ఈవీఎంలలో సమస్యలు తలెత్తినా.. కాసేపటికే పునరుద్ధరించారు. రాష్ట్రంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎన్నికలు జరిగినట్లు ఈసీ అధికారులు వెల్లడించారు.
అసోంలో ఓటేసేందుకు తరలిన మహిళలు అసోంలో ఓటు హక్కు వినియోగించుకున్న మహిళలు మొత్తం 10 వేల 592 పోలింగ్ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఓటర్లు బారులుదీరినట్లు తెలిపారు. మహిళలు ఉదయమే ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలారు.
అసోం ఎన్నికల తొలి దశలో 47 స్థానాల్లో.. దాదాపు 80 శాతం పోలింగ్ నమోదైంది.
బంగాల్లో 294 నియోజకవర్గాలకు మొత్తం 8 విడతల్లో, అసోంలోని 126 స్థానాలకు 3 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇవీ చదవండి:'బంగాల్లో భాజపా గాలి- 200+ సీట్లు మావే'