margadarshi : మార్గదర్శిపై చర్చకు తాము సిద్ధమని టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి స్పష్టం చేశారు. మే 14న హైదరాబాద్ లో ఉండవల్లితో చర్చించేందుకు సిద్ధం అని తెలిపారు. టీడీపీ కార్యాలయమే కాదు.. వైఎస్సార్సీపీ కార్యాలయానికి వచ్చేందుకైనా తాము సిద్ధమని ఆయన ప్రకటించారు. మార్గదర్శిలో ఏదో జరుగుతోందని, చందాదారులకు ఏదో నష్టం జరగబోతోందని హడావిడి చేస్తున్న ఉండవల్లి అరుణ్ కుమార్ తో ఎక్కడైనా సరే చర్చకు సిద్ధమని టీడీపీ నేత జీవీ రెడ్డి ప్రకటించారు. సీఎం జగన్ లేదా సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలోనైనా చర్చకు సిద్ధం అని ఆయన వెల్లడించారు. వేదిక ఎక్కడనేది కాదన్న జీవీ.. చర్చే ముఖ్యమని తెలిపారు. ఇందులో బలాబలాలకు సంబంధం లేదని, వాస్తవాలను ప్రజలకు తెలియాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. మార్గదర్శి విషయంలో బాధితులెవరూ లేరన్న ఆయన... ఫిర్యాదుదారులు కూడా లేరని స్పష్టం చేశారు. ప్రతీ అంశంపైనా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. చట్టం ఏం చెబుతుంది.. కోర్టులు ఏమంటున్నాయన్న దానిపైనా చర్చించాలని పేర్కొన్నారు. ఏం మాట్లాడినా దానికి ఆధారాలు ఉండాలన్న ఆయన.. ఆధారాలు లేకుండా మాట్లాడితే సరిపోదని అన్నారు. అన్ని ఆధారాలతో చర్చకు వస్తాం.. ఎవరు మాట్లాడినా సబ్జెక్ట్‌పైనే చర్చించాలని, అడ్డగోలు వాదనలతో కాలయాపన మంచిది కాదని సూచించారు. ఉండవల్లితో చర్చకు మా పార్టీ తరఫున ఎవరు వచ్చినా మాట్లాడగలరు.. పార్టీ సూచన మేరకు తాను వస్తున్నానని తెలిపారు.
రాష్ట్రాభివృద్ధి టీడీపీ లక్ష్యం... అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్రానికి పరిశ్రమలు రావాలనే టీడీపీ ఎప్పుడూ కోరుకుంటోందని జీవీ రెడ్డి స్పష్టం చేశారు. పరిశ్రమలు వస్తే ఉద్యోగావకాశాలు వస్తాయని భావిస్తామని, రాష్ట్రంలోని ఏ పరిశ్రమ, సంస్థకు ఇబ్బంది వచ్చినా స్పందిస్తామని తెలిపారు. ఈ విషయంలో భారతీ సిమెంట్స్ .. హెరిటేజ్.. ఏదైనా సరే... అండగా ఉంటామని అన్నారు. ప్రభుత్వం దురుద్దేశంతో కక్ష కట్టి వేధిస్తే టీడీపీ పోరాడుతుందని చెప్పారు.