దేశ రాజధానిలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో.. మహమ్మారి వ్యాప్తికి కళ్లెం వేసేందుకు కఠిన చర్యలు చేపట్టింది అక్కడి ప్రభుత్వం. మాస్క్ ధరించకుండా బయటకువచ్చిన వారికి రూ.2వేలు చొప్పున జరిమానా విధించాలని నిర్ణయించిన కేజ్రీవాల్ సర్కార్.. తాజాగా మరిన్ని కఠిన చర్యలను ప్రకటించింది. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించేలా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా, పొగాకు వాడినా, భౌతికదూరం పాటించకపోయినా రూ.2వేలు చొప్పున జరిమానా విధించనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది.
ప్రజల్లో భయం పెంచడానికి వీలుగా గతంలో రూ.500లుగా ఉన్న జరిమానాను రూ.2వేలకు పెంచింది ఆప్ ప్రభుత్వం. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ఆమోదం అనంతరం.. వైద్య ఆరోగ్యశాఖ ఈ నోటిఫికేషన్‌ను జారీచేసింది.