దక్షిణాసియా, హిందూ మహా సముద్ర ద్వీప దేశాల మధ్య సమైక్యత కొనసాగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కొవిడ్ మహమ్మారిపై పోరులో ప్రాంతీయ సహకార స్పూర్తి కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనే మార్గాలను చర్చించడానికి 10 పొరుగు దేశాలతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ఐకమత్యంపై దృష్టి సారిస్తే.. కొవిడ్ మహమ్మారి మాత్రమే కాకుండా మరే ఇతర సవాళ్లనైనా ఎదుర్కోగలమని మోదీ వ్యాఖ్యానించారు.
వ్యాక్సిన్ విషయంలోనూ..
దక్షిణాసియా దేశాలు, హిందూ మహాసముద్ర ద్వీప దేశాలు సమైక్యంగా లేకుంటే 21వ శతాబ్దం ఆసియా శతాబ్దం కాలేదని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతాల్లో ప్రపంచంలోకెల్లా అతి తక్కువ కరోనా మరణాల రేటు ఉందని చెప్పారు. ఏడాదికిపైగా అన్ని దేశాలు ఆరోగ్య సహకారాన్ని అందించుకున్నాయని మోదీ తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలోనూ అంతే సహకారం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశాల్లోని పౌర విమానయాన మంత్రిత్వ శాఖలు ఎయిర్ అంబులెన్సులు ఏర్పాటు చేసే అంశంపై అంగీకారం కుదుర్చుకోగలవా? అని మోదీ ఈ సమావేశంలో ప్రతిపాదించారు. కొవిడ్ వ్యాక్సిన్‌పై మరింత అధ్యయనానికి ప్రాంతీయ వేదికను సృష్టించుకోవాలని ప్రధాని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు, నర్సులు ఇతర దేశాల్లోకి వెళ్లేందుకు ప్రత్యేక వీసా పథకాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ సూచించారు. భారత్‌లో అమలవుతున్న ఆయుష్మాన్ భారత్, పేదలకు అందించే బీమా పథకాలు.. ఇతర దేశాలకు కేస్ స్టడీస్‌గా నిలుస్తాయని అన్నారు.
ఇదీ చదవండి:'బంగాల్‌ను ప్రపంచ పర్యటక ప్రదేశంగా మారుస్తాం'