Sperm Whale Vomit: తమిళనాడు నుంచి కర్ణాటకకు గుట్టు చప్పుడు కాకుండా అంబర్‌గ్రీస్‌ను(తిమింగలం వాంతి) తరలించిన ముఠాను అరెస్టు చేసింది బెంగళూరు సౌత్ ఈస్ట్ పోలీస్ విభాగం. నిందితుల నుంచి రూ. 4 కోట్లు విలువ చేసే 4 కేజీల పదార్థాన్ని స్వాధీనం చేసుకుంది.
తమిళనాడుకు చెందిన పన్నీర్ సెల్వం, ఆనంద్ శేఖర్, కే. మంజు అంబర్‌గ్రీస్ స్మగ్లింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. బెంగళూరు మైకో లే అవుట్ వద్ద నిందితులను పట్టుకున్నారు అధికారులు. నిందితులను అరెస్టు చేసి.. వారి కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు సౌత్ ఈస్ట్ డీసీపీ శ్రీనాథ్ మహాదేవ్ జోషి తెలిపారు.
అంబర్ గ్రీస్ అంటే..?
అంబర్ గ్రీస్ పదార్థం సాధారణంగా తిమింగలం జీర్ణవ్యవస్థలో తయారవుతుంది. అది వాంతి చేసుకున్నప్పుడు, ఉమ్మినప్పుడు బయటకు వస్తుంది. సెంట్లు, పర్ఫ్యూమ్ల తయారీలో దీనిని వినియోగిస్తారు. ఒక్క కిలో అంబర్ గ్రీస్‌కు రూ.కోట్లలో ధర ఉంటుంది. ఇండోనేషియా, ఇంగ్లాండ్‌లో ఈ పదార్థానికి విపరీతమైన డిమాండ్ ఉంది. అంబర్ గ్రీస్‌ను 1972 వన్యప్రాణుల చట్టం కింద నిషేధించారు.