దేశంలో మహమ్మారి మూడో ఉద్ధృతి కమ్ముకొస్తోందని వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. దీన్ని ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధం కావాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ.. రాష్ట్రాలకు లేఖలు రాస్తున్నారు. శుక్రవారం ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులో సమావేశమై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు సెప్టెంబరులో కొవిడ్ మూడోదశ తీవ్రస్థాయికి చేరవచ్చని వివిధ పరిశోధన సంస్థలు లెక్కలు వేశాయి. ఇప్పటికీ పలు రాష్ట్రాల్లో కేసులు భారీగానే నమోదవుతున్నాయి. లాక్‌డౌన్ నిబంధనలను సడలించడంతో పలు ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి ఊపందుకొంది. ఇన్‌ఫెక్షన్ నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లినవారు, కొత్తగా వైరస్ బారిన పడుతున్నవారి మధ్య తేడా క్రమంగా తగ్గుతోంది. ఆర్ ఫ్యాక్టర్ 1కి సమీపిస్తోంది.
ఈ తరుణంలో కొవిడ్ మూడో ఉద్ధృతిని నిలువరించే ప్రధాన అస్త్రం- వ్యాక్సినేషన్!
వీలైనంత త్వరగా.. ఎక్కువమందికి పూర్తిస్థాయిలో టీకాలు అందిస్తేనే కరోనా కట్టడి సాధ్యమవుతుంది. దేశంలో 94.47 కోట్ల మంది వయోజనులున్నారు. డిసెంబరు 31 నాటికల్లా అర్హులందరికీ వ్యాక్సిన్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మొత్తం 189 కోట్ల డోసులు కావాలి. కానీ, శుక్రవారం కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ చేసిన ప్రకటన మేరకు ఇప్పటివరకూ అందినవి 39.53 కోట్లే! అందులోనూ కేవలం 8.38% మందికే రెండు డోసులు వేశారు. దేశంలో 33.46% మందికి ఒక్కడోసే అందింది. డిసెంబరు 31లోపు లక్ష్యం చేరడానికి రోజూ సుమారు 88 లక్షల డోసులు అందించాల్సి ఉన్నా, జులైలో రోజూ 37.75 లక్షల డోసులే అందిస్తున్నారు. జనవరి 16న టీకా కార్యక్రమం మొదలైనప్పటి నుంచి 182 రోజులుగా సగటున 21.72 లక్షల డోసులు మాత్రమే ఇస్తున్నారు.
వ్యాక్సినేషన్‌ను ఉద్ధృతం చేయకుంటే.. మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవడం ప్రశ్నార్థకమే!
దేశంలో ఉత్పత్తి అవుతున్న టీకాల్లో 75% డోసులను కేంద్రం రాష్ట్రాలకు ఉచితంగా అందిస్తోంది. మిగతా 25% మొత్తాన్ని ప్రైవేటు సంస్థలు కొనుగోలుచేసి ప్రజలకు అందిస్తాయని ప్రకటించింది. ఆ మేరకు జులైలో రాష్ట్రాలకు 12 కోట్ల డోసులు ఇస్తామని కేంద్రం
తెలిపింది. ఇందులో 9 కోట్లు ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాలకు, 3 కోట్లు ప్రైవేటు సెంటర్లకు కేటాయించింది. ఒక్క నెలలో 12 కోట్ల టీకాలు అందించాలంటే.. రోజూ 38.70 లక్షల డోసులివ్వాలి. కానీ, ఈనెలలో ఇప్పటివరకూ సగటున నిత్యం 37,75,325 టీకాల చొప్పున మొత్తం 5,66,29,887 డోసులిచ్చింది. శుక్రవారం నాటి కొవిన్ పోర్టల్ ప్రకారం 35,010 ప్రభుత్వ, 2,023 ప్రైవేటు కేంద్రాలు టీకాలను అందిస్తున్నాయి. మొత్తం కేంద్రాల్లో ప్రైవేటు వాటా 5.46 శాతమే. కానీ, వాటికి ఏకంగా 25% టీకాలను వదిలిపెట్టడంతో లక్ష్యం దెబ్బతింటోందన్న వాదనలున్నాయి. శుక్రవారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా 39,53,43,767 మందికి టీకా ఇచ్చారు. ఇందులో 31.61 కోట్ల మంది ఒక డోసు, 7.92 కోట్ల మంది రెండు డోసులు తీసుకున్నారు.
సుప్రీంకోర్టుకు కేంద్రం ఏం చెప్పింది?
- ఈనెల చివరినాటికి 51.6 కోట్ల టీకా డోసులు అందుబాటులోకి వస్తాయని కేంద్రం అఫిడవిట్‌లో పేర్కొంది. ఇప్పటివరకూ 41.10 కోట్ల డోసులను రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు శుక్రవారం వెల్లడించింది. ఇంకా 10.5 కోట్ల టీకాలు ఇవ్వాల్సి ఉంది. మిగిలిన రోజుల్లో సగటున నిత్యం 66 లక్షల టీకాలు అందించాలి. ఈనెల 1 నుంచి జరుగుతున్న వాక్సినేషన్ తీరును చూస్తే.. రోజూ సగటున 37.75 లక్షల డోసులే ప్రజలకు అందుతున్నాయి.
- పూర్తిస్థాయి వ్యాక్సినేషన్‌కు 189 కోట్ల టీకాలు అవసరం. ఇప్పటివరకూ రాష్ట్రాలకు సరఫరా చేసిన 41.10 కోట్లను మినహాయిస్తే, ఇంకా 148 కోట్ల డోసులు కావాలి.
- డిసెంబరు నాటికి అర్హులందరికీ 'పూర్తిస్థాయి'లో టీకా అందిస్తామని కేంద్రం ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి ఇందుకు మిగిలివున్నది ఐదున్నర నెలలే. సుమారు 170 రోజుల వ్యవధిలో నిత్యం సగటున 87,05,882 డోసులివ్వాలి. కానీ, ప్రస్తుతం ఆ స్థాయిలో టీకాలు అందుబాటులో లేవు!
ప్రారంభంకాని ఉత్పత్తి