మొన్న ఉత్తరాఖండ్ సీఎం, నిన్న కర్ణాటక సీఎం, నేడు గుజరాత్ సీఎం.. కొన్ని నెలల వ్యవధిలో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చేసింది భాజపా హైకమాండ్. దీంతో నెక్ట్స్ ఎవరు? అన్న ప్రశ్న ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. దీనికి తొందరలోనే సమాధానం లభించే సూచనలు కనిపిస్తున్నాయి! హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్.. హడావుడిగా దిల్లీ వెళ్లడం ఇందుకు కారణం(jai ram thakur news).
ఠాకూర్ సహా హిమాచల్‌ప్రదేశ్ భాజపా బృందాన్ని దిల్లీకి పిలిపించింది అధిష్ఠానం. ఠాకూర్.. వారం రోజుల్లో దిల్లీ వెళ్లడం ఇది రెండోసారి. ఈ నెల 8న దేశ రాజధానికి వెళ్లిన ఆయన భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు.
తాజా పర్యటనలో.. ఠాకూర్ భాజపా హైకమాండ్‌తో మారోమారు చర్చించనున్నట్టు సమాచారం. ఈ భేటీలో పార్టీ హిమాచల్‌ప్రదేశ్ ఇంఛార్జ్ అవినాశ్ రాయ్ ఖన్నా, సహ ఇన్ఛార్జ్ సంజయ్ టాండన్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సురేశ్ కశ్యప్, సంస్థాగత ప్రధాన కార్యదర్శి పవన్ రాణా పాల్గొనే అవకాశముందని తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాలు, రానున్న ఉపఎన్నికలపై సుదీర్ఘ మంతనాలు జరగనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్ విమర్శలు...
అవకాశాన్ని ఉపయోగించుకున్న రాష్ట్ర కాంగ్రెస్.. భాజపాపై విమర్శల వర్షం కురిపించింది. ఠాకూర్‌ను తొలగించేందుకే దిల్లీకి పిలిపించారని ఎద్దేవా చేసింది. ఈ విషయాన్ని భాజపా చేపట్టిన 'జన్ ఆశీర్వాద్ యాత్ర'లో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఇప్పటికే సూచనప్రాయంగా చెప్పేశారని వ్యాఖ్యానించింది.