పద్మశ్రీ మీనాక్షి అమ్మకు.. బాల్యంలో చదువు కంటే నాట్యమంటేనే ఇష్టం. ఆమె ఆసక్తిని, ప్రతిభను గుర్తించిన నాట్యగురువు ఏడేళ్ల చిన్నారి మీనాక్షిని కలరిపయట్టు నేర్చుకోమని సలహా ఇచ్చాడు. ఏడేళ్ల ఆ చిన్నారి జీవితానికే కాదు, కేరళలోని శతాబ్దాల నాటి ఆత్మరక్షణ విద్య కలరిపయట్టు కళకు అదే టర్నింగ్ పాయింట్. దేశవ్యాప్తంగానే కాదు.. విదేశాల నుంచీ ఎంతోమంది దృష్టి కలరిపై పడింది ఆ తర్వాతే. 13 ఏళ్ల తర్వాత ఆడపిల్లలు కలరి సాధన చేయకూడదన్న నిబంధన అప్పట్లో ఉండేది. వడక్కన్ పట్టుకల్లో పుట్టిన మీనాక్షి ఆ నిబంధనను పటాపంచలు చేసింది. 13 ఏళ్లు నిండిన తర్వాతా కలరి సాధన కొనసాగించింది. ఏడేళ్ల వయసులో ప్రారంభించి, 70 ఏళ్లుగా కలరితోనే కలిసి జీవిస్తోంది గురుక్కల్ మీనాక్షి అమ్మ. చీరకట్టులో ఆమె చేసే విన్యాసాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. 79 ఏళ్ల మీనాక్షి అమ్మ.. తన చివరి శ్వాస వరకూ కలరిని వీడనని చెప్తోంది. నేర్చుకునే వయసులోనే.. తోటి అబ్బాయిలను చిత్తుగా ఓడించేంది మీనాక్షి.
కలరిపయట్టు జంటగా..
పదో తరగతి తర్వాత చదువు మానేసిన మీనాక్షి.. కలరి గురువు రాఘవన్ను వివాహం చేసుకుంది. తర్వాత ఆ కళే ఆమె జీవితంగా మారిపోయింది. కడతనాడు ఆధ్వర్యంలో ఏ ఆలయంలో వేడుకలు జరిగినా.. రాఘవన్, మీనాక్షిల జంట ప్రదర్శన తప్పకుండా ఉండేది. అలా ఈ ఇద్దరికీ కలరిపయట్టు జంటగా పేరొచ్చింది. రాఘవన్ మరణం తర్వాత.. విద్యార్థులకు కలరి నేర్పించే బాధ్యతలు మీనాక్షి తీసుకుంది. భర్త చనిపోయిన 41వ రోజున ఓ వేదికపై ప్రదర్శన ఇచ్చింది. అప్పటినుంచీ వయసుతో పోటీ పడుతూ.. కలరి కోసమే తన జీవితాన్ని కేటాయిస్తోంది మీనాక్షి అమ్మ.
"కొవిడ్ సమయంలోనూ క్రమం తప్పకుండా కలరి సాధన చేశాను. ఏడేళ్ల వయసులో కలరి నేర్చుకోవడం ప్రారంభించాన్నేను. మొదట్లో.. నాట్యంపైనే ఎక్కువ ఇష్టం ఉండేది. పదో తరగతి తర్వాత అసలు చదువు వైపునకే వెళ్లలేదు. పెళ్లి తర్వాత కూడా నా భర్తతో కలిసి కలరి సాధన కొనసాగించాను. ఆ తర్వాత ఈ విద్యే.. నా జీవితమైపోయింది. నా భర్త పూర్తి సహకారమందించారు. ఆయన చనిపోయాక.. కలరి బాధ్యతలు తీసుకుని మరింత చురుగ్గా మారాను. నా పిల్లలు, విద్యార్థులే నా బలం. నేను కలరిలోకి అడుగు పెట్టి 60 ఏళ్లకు పైగానే అవుతోంది. ఇక్కడ నేర్చుకనే వాళ్ల వద్ద నుంచి ఎలాంటి ఫీజూ వసూలు చేయం."
- మీనాక్షి అమ్మ, కలరిపయట్టు శిక్షకురాలు
పద్మశ్రీతో..
కలరిపయట్టులో మీనాక్షి అమ్మ నైపుణ్యాలకు, ఆమె తెగువకు గానూ.. భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో ఆమెను సత్కరించింది.